దేశంలో అన్ని వర్గాల వారి అభిప్రాయాలు సేకరించే బడ్జెట్ ప్రవేశపెట్టామని రాజ్యసభలో స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 130 కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడించారు. ఆత్మనిర్బర్ భారత్ కోసం ఈ బడ్జెట్ ఓ సాధనంలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు నిర్మల.
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. లాక్డౌన్ సమయంలో 4 కోట్ల మందికి నేరుగా ఆర్థికసాయం సహా కోట్లాది కుటుంబాలకు ఉచిత బియ్యం, గ్యాస్ ఇచ్చినట్లు వెల్లడించారు.
''పీఎం ఆవాస్ యోజన కింద 1.67 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీతో రాష్ట్రాలకు అండగా నిలిచాం. పీఎం గ్రామ్‌సడక్ యోజన కింద 2.11 లక్షల కి.మీ. మేర రహదారులు నిర్మించాం. 9 కోట్ల మంది రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన కింద లబ్ది చేకూరింది. ఈ-నామ్ కింద 1.69 కోట్ల మంది రైతులకు మేలు కలిగింది. ముద్ర యోజన కింద రూ.27,000 కోట్ల రుణాలు ఇచ్చాం.''
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు నిర్మల. ప్రభుత్వం ఎంత చేసినా.. అదే పనిగా ఆరోపణలు చేయడం, తప్పుడు కథనాలు సృష్టించడం అలవాటుగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం, అవసరమున్న వారి కోసం చేస్తుంటే.. మిత్రుల కోసం చేస్తుందని కేంద్రంపై విమర్శలు చేయడం తగదని అన్నారు నిర్మల.
డిజిటల్ చెల్లింపులు ఎవరి కోసం..?
డిజిటల్ చెల్లింపులపైనా విపక్షాలు చేసే విమర్శల్ని రాజ్యసభ వేదికగా తిప్పికొట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి. మధ్య తరగతి ప్రజలు, చిన్నవ్యాపారుల కోసమే యూపీఐని తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
''2016 ఆగస్టు నుంచి 2020 జనవరి వరకు యూపీఏ ద్వారా జరిగిన డిజిటల్ చెల్లింపులు 3.6 లక్షల కోట్లు. యూపీఐని ఎవరు వాడుతున్నారు? సంపన్నులా? కాదు మధ్య తరగతివారు, చిన్నవ్యాపారులు కదా. మరి వారెవరు? మరి ప్రభుత్వం యూపీఐని సృష్టించి.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేది ధనవంతులా కోసమా? తన మిత్రుల కోసమా?''
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మల ప్రసంగం అనంతరం.. రాజ్యసభ మార్చి 8కి వాయిదా పడింది.
ఇదీ చూడండి: టీఎంసీకి షాక్- రాజ్యసభ సభ్యుడి రాజీనామా