బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. దీంతో పసిడి ధరలు తగ్గి, దేశీయ ఆభరణాలు, రత్నాల ఎగుమతికి మార్గం సుగమం కానుంది. బంగారం, వెండి కడ్డీలు, ప్లాటినం, విలువైన లోహ నాణేలపైనా దిగుమతి సుంకాన్ని తగ్గించింది కేంద్రం.
అయితే బంగారం, వెండి సహా కడ్డీ బంగారంపై 2.5 శాతం వ్యవసాయ మౌలిక, అభివృద్ధి(అగ్రి ఇన్ఫ్రా) సుంకాన్ని విధించనుంది కేంద్రం.
"బంగారం, వెండిపై ప్రస్తుతం 12.5 శాతం సాధారణ కస్టమ్స్ డ్యూటీ ఉంది. 2019 జులైలో కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి పెంచినందున బంగారం ధరలు భారీగా పెరిగాయి. ధరలను ఇదివరకటి స్థాయికి తీసుకొచ్చేందుకు బంగారం, వెండి ధరలను ఇప్పుడు హేతుబద్ధీకరిస్తున్నాం."
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
కస్టమ్స్ డ్యూటీ వివరాలు(శాతాల్లో)
విభాగం | ప్రస్తుత సుంకం | తగ్గించిన తర్వాత |
బంగారం/వెండి | 12.5 | 7.5 |
బంగారం కడ్డీలు | 11.85 | 6.9 |
వెండి కడ్డీలు | 11 | 6.1 |
ప్లాటినం | 12.5 | 10 |
బంగారం/వెండి ఫైండింగ్స్ | 20 | 10 |
విలువైన లోహ నాణేలు | 12.5 | 10 |
కాగా, కేంద్రం నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. ప్రభుత్వ చర్యలు దేశీయ తయారీని ప్రోత్సహించి, ఎగుమతులకు ఊతం అందిస్తాయని 'రత్నాలు-ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి' ఛైర్మన్ కొలిన్ షా పేర్కొన్నారు. దిగుమతి సుంకాన్ని తగ్గించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోందని చెప్పారు.
ఇదీ చదవండి: ఆ సీనియర్ సిటిజన్లకు రిటర్నుల నుంచి విముక్తి