ఏప్రిల్ 1 నుంచి దేశంలో బీఎస్-6 ఉద్గార నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. మార్చి 31తో బీఎస్-4 వాహనాల అమ్మకాలు ముగియనున్నాయి. తదనంతరం నుంచి వాటి రిజిస్ట్రేషన్‌తోపాటు విక్రయాలు నిషేధం. అయితే ఒకవేళ అప్పటిలోపు విక్రయాలు కాకుంటే ఏం చేయాలి? కంపెనీలు, డీలర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు. ప్రస్తుతం వాహనాల విక్రయాలు ఎలా ఉన్నాయి? తెలుసుకుందాం.
దేశంలో మార్చి 31 అనంతరం కేవలం బీఎస్-6 వాహనాలు మాత్రమే అమ్మేందుకు అనుమతి ఉంటుంది. ఆ వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. బీఎస్-4 వాహనాలపై ఇప్పటికే పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి కంపెనీలు. వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
సెకండ్ హ్యాండ్లో అమ్ముకోవాలి
మార్చి 31లోపు బీఎస్-4 వాహనాలు పూర్తిగా విక్రయాలు కానట్లయితే.. కంపెనీలు మరిన్ని ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మిగిలిన వాహనాలను బీఎస్-4 నియమాలు అనుమతించే దేశాలకు ఎగుమతి చేయటమే మార్గమని పేర్కొంటున్నారు. ఒకవేళ అదీ సాధ్యం కాకపోతే.. గడువులోగా డీలర్లు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని సెకండ్ హ్యాండ్లో అమ్ముకోవాల్సి ఉంటుంది.
ఫిబ్రవరిలో పెరిగిన విక్రయాలు
ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు ఫాడా(ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే సమయంతో పోల్చితే రిజిస్ట్రేషన్లలో 2.6 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.
రిజిస్ట్రేషన్లలో వృద్ధి.. వాహనాల వారీగా
వాహనాలు | వృద్ధి శాతం |
ద్విచక్ర వాహనాలు | 20.7 |
త్రిచక్ర వాహనాలు | 1.52 |
వినియోగ వాహనాలు | 13 |
ట్రాక్టర్లు | 13.52 |
మరోవైపు.. ప్రయాణికుల వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం 1.17 శాతం పడిపోయాయి.
ద్విచక్ర వాహనాలు
మార్కెట్లో ఇతర వాహనాలతో పోల్చితే ద్విచక్ర వాహనాల స్టాక్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. వీటి అమ్మకం విషయంలో ఫాడా అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటి పూర్తి స్టాక్‌ను విక్రయించుకునేందుకు వాహన కంపెనీల నుంచి తగిన ప్రోత్సాహం లేదని అభిప్రాయపడింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు ఎక్కువ స్థాయిలో పెరగటం వల్ల మొత్తంగా రిజిస్ట్రేషన్లు పెరిగాయని తెలిపింది.
బీఎస్-4 గడువు ముగుస్తున్న దృష్ట్యా మొత్తం మీద విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవని ఫాడా అధ్యక్షులు ఆశిస్ హన్స్ రాజ్ తెలిపారు. మార్చి చివర్లో మంచి డీల్స్ వస్తాయని వినియోగదారులు ఆశిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనాతో మరో దెబ్బ..
గడువులోపు వాహనాలను విక్రయించటమే సవాలుగా ఉన్న డీలర్లకు ప్రస్తుతం కరోనా ప్రభావంతో మరో ఎదురుదెబ్బ తగిలినట్లు ఫాడా అభిప్రాయపడింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న సెంటిమెంటుతో పాటుగా కరోనా భయంతో వినియోగదారులు వాహనాలు కొనేందుకు మొగ్గు చూపటం లేదని తెలిపింది.
మార్చిలోనూ అంతంత మాత్రమే
ఫాడా చేసిన సర్వే ప్రకారం మార్చిలో 43 శాతం మేర వాహన విక్రయాలు తగ్గిపోతాయని డీలర్లు అభిప్రాయపడ్డారు. కేవలం 25 శాతం మంది మాత్రమే విక్రయాలు పెరుగుతాయని అన్నారు. మిగతా వారు స్థిరంగా ఉంటాయని తెలిపారు.