Ukraine conflict: ఉక్రెయిన్-రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ (Sensex) 1413 పాయింట్ల నష్టంతో 52,920 వద్ద, నిఫ్టీ (Nifty) 447 పాయింట్లు నష్టపోయి 15,798 వద్ద ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క టాటా స్టీల్ మాత్రమే లాభాల్లో పయనిస్తోంది. మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్‌ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.
భారీగా పెరిగిన చమురు ధరలు..
ఇక ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరంకావడం సహా రష్యాపై ఆంక్షలకు పశ్చిమదేశాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ చమురు ధర సోమవారం 10డాలర్లకు పైగా పెరిగింది. 130 డాలర్లకు చేరింది. బెంచ్‌మార్క్ యూఎస్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌పై 9డాలర్లు పెరిగి 124డాలర్లకు ఎగబాకింది. లిబియాలోని రెండు కీలకమైన ఆయిల్ ఫీల్డ్స్‌ను సాయుధులు మూసివేశారని ఆ దేశ జాతీయ ఆయిల్ కంపెనీ ప్రకటన కూడా చమురు ధరలపై మరింత ఒత్తిడి పెంచింది.
రష్యాపై ఇప్పటి వరకు కఠిన ఆర్థిక ఆంక్షలు ప్రయోగించిన పాశ్చాత్య దేశాలు.. తాజాగా ఆ దేశం నుంచి దిగుమతి అవుతున్న చమురునూ ఆంక్షల పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే వాహనరంగాన్ని కలవరపెడుతున్న చిప్‌ల కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
ఇదీ చూడండి: Russia-Ukraine conflict: భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు!