ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) రికార్డు సమయంలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంటును సిద్ధం చేసింది. కరోనా రెండో దశ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్‌కు విపరీతమైన కొరత ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, బీహెచ్‌ఈఎల్ మెడికల్ ఆక్సిజన్ యూనిట్ల తయారీని చేపట్టింది. ఈ సంస్థ సీఎస్‌ఐఆర్-ఐఐపీ నుంచి తయారీ సాంకేతికతను తీసుకుని, ఈ ప్లాంట్లను సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటి ఆక్సిజన్ ప్లాంటును హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్‌కు అందించినట్లు బీహెచ్‌ఈఎల్ తెలిపింది. ఆర్డరు లభించిన నాటి నుంచి 35 రోజుల్లో దీన్ని అందించినట్లు సంస్థ తెలిపింది.
నిమిషానికి 500 లీటర్ల (ఎల్‌పీఎం) ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ఆక్సిజన్ ప్లాంటుకు ఉంది. 1,000 ఎల్‌పీఎంకు మించి కూడా పెంచుకోవచ్చు. హైదరాబాద్, భోపాల్, హరిద్వార్‌లలో ఉన్న బీహెచ్‌ఈఎల్ సంస్థ ప్లాంట్లలో దీన్ని యుద్ధ ప్రాతిపదికన తయారు చేశారు. నమూనాను జూన్ 11 నాటికి హైదరాబాద్ యూనిట్లో సిద్ధం చేశారు. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 500, 1000 ఎల్‌పీఎం ఆక్సిజన్ ప్లాంట్ల కోసం ఆర్డర్లు వచ్చినట్లు బీహెచ్‌ఈఎల్‌కు వెల్లడించింది.
ఇదీ చూడండి: వచ్చే వారం నుంచే మోడెర్నా టీకా పంపిణీ!
ఇదీ చూడండి: 'ఆగస్టు నుంచే కరోనా మూడో దశ వ్యాప్తి'