జియో గిగా ఫైబర్...! రిలయన్స్ నుంచి వస్తున్న మరో సంచలనం. ఒకే కనెక్షన్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, డీటీహెచ్ సేవలు అందించడం గిగా ఫైబర్ ప్రత్యేకత. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న గిగా ఫైబర్... ఆగస్టు 12 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని గతేడాది ప్రకటించారు. అప్పటి నుంచి లక్షలాది మంది దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని కొంత మంది స్కామర్లు హానికరమైన ఈమెయిల్స్ (ఫిషింగ్ మెయిల్స్) ద్వారా జియో వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
'ఫిషింగ్' అంటే ఏమిటి?
స్కామర్లు ప్రజలను తమ ఉచ్చులోకి రప్పించడానికి ఎలా ప్రయత్నిస్తారో మొదట అర్థం చేసుకోవాలి. ఇందుకోసం ఫిషింగ్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం. ఫిషింగ్ అనేది టెక్ పరిభాషా పదం. ఇది 'వంచన', 'చౌర్యం'ను సూచిస్తుంది.
ఫిషింగ్ చేసే హ్యాకర్ లేదా స్కామర్ ముందుగా మిమ్మల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకోసం ఒరిజినల్ వెబ్‌సైట్‌ను పోలి ఉండే వెబ్‌సైట్‌ను రూపొందిస్తాడు. తరువాత మీ బ్యాంకు ఖాతా సమాచారం, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన డేటాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి సమాచారమంతా సేకరించాడంటే...... ఇంకేముంది మీ బ్యాంకు ఖాతాలోని ధనం గల్లంతే.
స్కామర్లతో జాగ్రత్త
జియో గిగాఫైబర్ విషయానికి వస్తే... స్కామర్లు మొదటగా తాము సంస్థ ప్రతినిధులమని నమ్మిస్తారు. గిగా ఫైబర్ రిజిస్ట్రేషన్ల పేరిట ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. వీటిలో సబ్జెక్ట్.... గిగాఫైబర్ యాక్టివేషన్ రిక్వెస్ట్ స్వీకరించాం అని ఉంటుంది. మెయిల్లో జియో డిజిటల్ లైఫ్ మాస్ట్‌హెడ్ ఉంటుంది. అలాగే గిగాఫైబర్ ప్లాన్లతోపాటు వినియోగదారులు తమ సభ్యత్వాన్ని ధ్రువీకరించే లింకులు కూడా ఉంటాయి. ఇలాంటి మెయిల్స్ వస్తే కచ్చితంగా వాటిని తెరవవద్దు.
ఏమరుపాటు వద్దు
స్కామర్లు జియో ఉపయోగించే ఫాంట్లు, గ్రాఫిక్లనే ఉపయోగించి.... ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. ఇది నిజంగా జియోనే పంపించిందనే భ్రమ కల్పించి... మిమ్మల్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ నిశితంగా పరిశీలిస్తే అది నిజమైనదా? లేదా? అనేది మీరే గుర్తించగలరు. కనుక అనుమానాస్పదంగా కనిపిస్తే అలాంటి మెయిల్స్‌ను స్పామ్లో పడేయండి.
ఇదీ చూడండి: విపణి: దేశీయ స్టాక్ మార్కెట్లకు ఏమైంది?