ఎక్కడ చూసినా కరోనా ఉలికిపాట్లే. ప్రపంచం మొత్తం అప్రమత్తం అయింది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఇదే అదనుగా హ్యాకర్లు తమదైన ప్రత్యేకతతో వల పన్నేందుకు సిద్ధం అయ్యారు. కరోనా మెయిల్స్ పంపుతున్నారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనల్ని అడ్డుపెట్టుకుని వైరస్‌తో కూడిన మెయిల్స్‌ని ఇన్‌బాక్స్ చేరేలా చేస్తున్నారు.
అచ్చం అలాగే..
ఏంటో చూద్దాం అని మెయిల్ ఓపెన్ చేసి దాంట్లో లింక్‌లను క్లిక్ చేశారా అంతే సంగతులు. ఎందుకంటే.. అదో మాల్వేర్. పీడీఎఫ్, ఎంపీ4, డాక్‌ఎక్స్.. ఇలా పలు ఫార్మాట్లలో కరోనాకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాల్ని జోడించి మెయిల్స్ పంపుతున్నారు. ప్రముఖ ఆరోగ్య సంస్థలు పంపినట్టుగా వాటిని డిజైన్ చేస్తున్నారు.
తొలగించడమే మేలు
ఫోన్, కంప్యూటర్‌లో ఇలాంటి నోటిఫికేషన్స్‌ని ఓపెన్ చేస్తే చాలు. ఆయా లింక్‌లు, డాక్యుమెంట్లలోని ట్రోజన్ మాల్వేర్‌లు సిస్టంలో చొరబడతాయి. మొత్తం సిస్టంను తన నియంత్రణలోకి తీసుకొని కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తాయి. ఈ-మెయిల్ అటాచ్‌మెంట్లతో వచ్చే కొన్ని ట్రోజన్స్ సిస్టమ్ లేదా ఫోన్‌ని పని చేయకుండా బ్లాక్ చేస్తాయి కూడా. మరికొన్ని.. సిస్టమ్‌లోని మొత్తం డేటాను చెరిపేస్తాయి. అందుకే కరోనా వైరస్ మీకు మాత్రమే హాని కాదు. మీరు వాడుతున్న గ్యాడ్జెట్‌లకూ ప్రమాదకరంగా మారింది. ఈ తరహా మెయిల్స్‌ని గమనిస్తే ముట్టకుండా తొలగించడమే మంచిది.
ఇదీ చదవండి: కొవిడ్-19 ఆరోగ్య పాలసీలు.. సరికొత్తగా మీ కోసం!