కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు.. రాజకీయ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది.
తాజాగా రైతుల ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ పలు బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు ప్రకటన విడుదల చేశాయి.
వీలైనంత త్వరగా చర్చలు జరిపి.. వారి సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం (ఏఐబీఓఏ), భారత జాతీయ బ్యాంక్ అధికారుల కాంగ్రెస్ (ఐఎన్బీఓసీ)లూ.. ప్రభుత్వం రైతులు సమస్యలు పరిష్కరించే విధంగా ఫలవంతమైన చర్చలు జరపాలని సూచించాయి.
రైతులు ఇబ్బందులు పడటం దేశానికి మంచిదికాదని బ్యాంక్ సంఘాలు వెల్లడించాయి. కరోనా వంటి సంక్షోభంలోనూ వ్యవసాయ రంగం మాత్రమే సానుకూలంగా పని చేసిందని గుర్తు చేశాయి. ప్రభుత్వ రంగ, స్థానిక గ్రామీణ, కో ఆపరేటివ్ బ్యాంకుల్లో 80 శాతం వినియోదారులు రైతులేనని తెలిపాయి. కాబట్టి వీలైనంత త్వరగా రైతుల సమస్యలు పరిష్కరించడం అవసరమని పేర్కొన్నాయి.
ఇవీ చూడండి: