దేశంలో కరోనా ప్రభావం నుంచి కోలుకుని పారిశ్రామిక, వ్యవసాయంతో పాటు ఇతర రంగాలు గాడినపడుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్న క్రమంలో బ్యాంకుల నుంచి రుణాల మంజూరు, డిపాజిట్లు డిసెంబర్ 4తో ముగిసిన పక్షం రోజుల వ్యవధిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 4 మధ్య బ్యాంకుల రుణాల మంజూరు 5.73 శాతం వృద్ధితో రూ. 105.04 లక్షల కోట్లు చేరినట్లు తాజాగా విడుదల చేసిన ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో డిపాజిట్లు సైతం 11.34 శాతం పెరిగి.. రూ. 145.92 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
2019 డిసెంబర్ 6తో ముగిసిన పక్షం రోజుల వ్యవధి బ్యాంకు రుణాలు రూ.99.35లక్షల కోట్లు కాగా.. డిపాజిట్లు రూ.131.06గా ఉన్నాయి.
అలాగే.. ఈ ఏడాది నవంబర్ 20తో ముగిసిన పక్షం వ్యవధిలో రుణాలు 5.82 శాతం వృద్ధితో రూ.104.34 లక్షల కోట్లు, డిపాజిట్లు 10.89 శాతం పెరుగదలతో రూ.143.70 లక్షల కోట్లుగా ఉన్నాయి.
రంగాల వారీగా రుణాలు..
- ఆహారేతర రంగాలకు బ్యాంకుల రుణాలు మంజూరు ఈ ఏడాది అక్టోబర్‌లో 5.6 శాతం వృద్ధి నమోదైంది. అది గతేడాది అక్టోబర్‌లో 8.3 శాతంగా ఉంది.
- వ్యవసాయం, అనుబంధ రంగాల్లో బ్యాంకు రుణాలు 7.4శాతం వృద్ధి నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయానికి 7.1శాతంగా వృద్ధి ఉంది.
- పారిశ్రామిక రంగాలకు బ్యాంకుల రుణాల వృద్ధి ఈ ఏడాది అక్టోబర్‌లో 1.7శాతం మాత్రమే నమోదైంది. 2019లో పరిశ్రమల రుణాల్లో వృద్ధి 3.4శాతంగా ఉంది.
- సేవారంగానికి బ్యాంకులు అధికంగా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. రుణాలను పొందడంలో సేవారంగం గణనీయమైన వృద్ధిని కనబర్చింది. 2019 అక్టోబర్‌లో ఈ రంగం వాటా 6.5శాతం ఉండగా.. అది 2020 అక్టోబర్‌కు 9.5శాతానికి చేరింది.
- వ్యక్తిగత రుణాల్లో క్షీణత కనిపించింది. 2019 అక్టోబర్ (17.2 శాతం వృద్ధి)తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 9.3 శాతానికి పరిమితమైంది.
ఇదీ చూడండి: 'లాక్డౌన్లో 45శాతం పెరిగిన వాచ్‌టైం'