ప్రయాణ వ్యవధి ఆధారంగా విమానాల టికెట్ ధరలను ఏడు బ్యాండ్లుగా వర్గీకరించినట్లు పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. తొలి కేటగిరీలో 40 నిమిషాలలోపు నిడివి ఉన్న విమాన ప్రయాణాలు ఉంటాయని తెలిపారు. రెండు మూడు, నాలుగు, ఐదు బ్యాండ్ల్లో ప్రయాణ వ్యవధి వరుసగా 40-60, 60-90, 90-120, 120-150 నిమిషాలుగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
ఆరో బ్యాండ్లో 150-180, ఏడో బ్యాండ్లో 180 నుంచి 200 నిమిషాల వ్యవధి ఉన్న విమాన ప్రయాణాలను చేర్చినట్లు పూరీ తెలిపారు. దిల్లీ- ముంబయి మార్గంలో టికెట్ గరిష్ఠ ధర రూ. 10 వేలుగా నిర్ణయించారు. ఈ నిబంధనలు ఆగస్టు 24 వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.
అయితే ఎప్పటి నుంచి విమానాలు పూర్తి స్థాయిలో నడుస్తాయన్న విషయంపై స్పష్టత లేదని పూరీ తెలిపారు. ప్రయాణికుల మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ లేకున్నా విమానం ఎక్కవచ్చని స్పష్టం చేశారు. అయితే ఏ కారణంగా యాప్ ఫోన్లో తెలుపుతూ.. స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
సగటు ధరలకే
విమానంలోని 40 శాతం సీట్లను ప్రయాణానికి నిర్ణయించిన గరిష్ఠ, కనిష్ఠ ధరలలో మధ్యస్థ రేట్లకు విక్రయించాలని విమనయాన శాఖ కార్యదర్శి పీఎస్ ఖారోలా స్పష్టం చేశారు.
ప్రైవేటు కూడా
వందేభారత్ మిషన్లో ప్రైవేటు విమానయాన సంస్థలు సైతం భాగస్వామ్యం అవుతాయని కేంద్రమంత్రి పూరీ తెలిపారు. ఈ మిషన్లో భాగంగా ఇప్పటివరకు 20 వేల మంది ప్రవాసులను భారత్కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
మే 25 నుంచి గాల్లోకి..
కరోనా కట్టడికి మార్చి 25న విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది కేంద్రం. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25 నుంచి దేశీయ విమాన సేవలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది.