అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైన అరబిందో(Aurobindo Pharma) ఫార్మా ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.6,001.5 కోట్ల ఆదాయాన్ని, రూ.801.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2019-20 ఇదేకాలంలో ఆదాయం రూ.6,158.4 కోట్లు, నికరలాభం రూ.863.2 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చి చూస్తే ఆదాయం 2.5 శాతం, నికరలాభం 7.2 శాతం తగ్గింది. మార్చి త్రైమాసికంలో అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఫార్ములేషన్ల ఆదాయాలు తగ్గడం ఇందుకు కారణంగా కంపెనీ వివరించింది. ఏఆర్‌వి (యాంటీ-రెట్రోవైరల్స్) ఆదాయాలు 28.7 శాతం, ఏపీఐ (యాక్టివ్- ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్) ఆదాయాలు 5.1 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి అరబిందో(Aurobindo Pharma) ఫార్మా రూ.24,774.6 కోట్ల ఆదాయాన్ని, రూ.5,334.9 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. వార్షిక ఈపీఎస్ రూ.91.04 ఉంది. 2019-20లో ఆదాయం రూ.23,098.5 కోట్లు, నికరలాభం రూ.2,845.1 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 7.3 శాతం, నికరలాభం 87.5 శాతం పెరిగినట్లు అవుతోంది. యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి 42 ఔషధాలకు ఏఎన్‌డీఏ అనుమతులు వచ్చాయని, ఇందులో 17 ఇంజక్టబుల్ ఔషధాలు ఉన్నట్లు పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి సవాళ్లను తట్టుకుని మెరుగైన ఫలితాలు సాధించినట్లు అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ అభిప్రాయపడ్డారు. సంక్లిష్టమైన జనరిక్ ఔషధాలు ఆవిష్కరించడంలో కీలక ప్రగతి సాధించినట్లు చెప్పారు.
కొవిడ్-19 టీకా తయారీ యూనిట్ సిద్ధం
కొత్తగా చేపట్టిన కొవిడ్-19 టీకాల తయారీ యూనిట్ నిర్మాణం జూన్‌లో పూర్తవుతుందని, జులైలో ప్రయోగాత్మక తయారీ (ట్రయల్ బ్యాచెస్) మొదలు పెడతామని అరబిందో(Aurobindo Pharma) ఫార్మా వెల్లడించింది. దేశీయ అవసరాలతో పాటు కొవిడ్-19 టీకాల ఎగుమతుల కోసం ఈ యూనిట్‌ను వినియోగిస్తామని పేర్కొంది. టీకాపై మనదేశంలో రెండు, మూడో దశల క్లినికల్ పరీక్షల నిర్వహణకు అనుమతి కోసం దరఖాస్తు చేశామని, ఈ పరీక్షల మధ్యంతర ఫలితాల ఆధారంగా అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) తీసుకునేందుకు ప్రయత్నిస్తామని వివరించింది. ఈ సంవత్సరాంతానికి లేదా వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అత్యవసర అనుమతి రాగలదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. కొవిడ్-19 టీకాకు సంబంధించి తన భాగస్వామ్య సంస్థ కూడా తైవాన్‌లో క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తోందని, రెండు మూడు నెలల్లో ఆ సంస్థకు అక్కడ అనుమతి రావచ్చని వివరించింది. తొలిదశలో 2.50 కోట్ల డోసులకు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నామని, తైవాన్ అనుమతిని ఇతర దేశాలు సైతం అంగీకరిస్తే డిమాండ్ ఇంకా పెరుగుతుందని వివరించింది. పెప్టైడ్ ఆధారిత టీకా తయారీకి కూడా తమ యూనిట్లో అవకాశం ఉందని పేర్కొంది.
బీఎస్‌ఈలో అరబిందో ఫార్మా షేరు శుక్రవారం ముగింపు ధర రూ.1021.90 కాగా, సోమవారం 2.36 శాతం (రూ.24.15) నష్టపోయి రూ.997.75 స్థిరపడింది.
ఇదీ చూడండి: '2020-21లో దేశ జీడీపీ 7.3% క్షీణత'