దీపావళి అంటే ఆటోమొబల్కు పండగ సీజన్. ప్రస్తుతం ఆఫర్లు, డిస్కౌంట్లు, రాయితీలపైనే చర్చ జరుగుతుంటుంది. వీటితో పాటు మరో ముఖ్యమైన పదం ఎక్స్‌టెండెడ్ వారెంటీ వినిపిస్తుంటుంది. మరి దాని ప్రాముఖ్యం ఏమిటో తెలుసుకుందాం.
కొత్త కారు, బైక్ కొన్నప్పుడు సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు రెండేళ్ల ప్రామాణిక వారెంటీనిస్తాయి. ఈ సమయంలో ఇంజిన్ సహా కీలకమైన విడిభాగాల్లో తయారీ లోపాలుంటే ఉచితంగా మరమ్మతు చేస్తారు. కుదరకపోతే కొత్తవి ఇస్తారు. మరి రెండేళ్ల తర్వాత లోపం బయట పడితే? వాహన యజమానిపై మోయలేనంత భారం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకునేదే ఎక్స్‌టెండెడ్ వారెంటీ. అంటే ఈ భరోసాని మరో ఐదేళ్ల వరకు పొడిగించుకునే వెసులుబాటు అన్నమాట.
ఎవరికి అవసరం?
వారెంటీ పొడిగించుకోవాలా? వద్దా? అన్నది మనం వాహనం ఉపయోగించుకునే తీరు, వ్యక్తిగత ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బండి ప్రామాణిక వారెంటీ తీరేలోగానే అమ్మేస్తుంటారు. అలాంటి వారికి దీని అవసరం ఉండకపోవచ్చు. అయినా అమ్మేటప్పుడు మంచి విలువ రావాలంటే ఇది కొంత ఉపయోగకరం. ఇక రెండేళ్ల తర్వాతా వాహనాన్ని కొనసాగించాలనుకుంటే వారెంటీ పొడిగింపు తప్పనిసరని భావించాలి. రెండు మూడేళ్ల తర్వాత ఏవైనా విడిభాగాలు విఫలమైతే.. భారీ ఖర్చు నుంచి కాపాడేది ఈ పొడిగింపే.
ఇవి గమనించాలి?
ఎక్స్‌టెండెడ్ వారంటీ అన్ని విడిభాగాలకూ వర్తించదు. అవసరమైన కవరేజీ లభించని వారెంటీని కొనుగోలు చేయొద్దు. ఏవేవి కవరేజీ కిందకి వస్తాయో? ఏవి రావో? క్షుణ్నంగా పరిశీలించాలి. బండి కొని ఎన్నేళ్లైంది? ఇప్పుడెలా ఉన్నదీ గమనించాలి. ఎంత వ్యయం అవుతున్నదీ పరిగణనలోకి తీసుకోవాలి. వారెంటీ తీసుకున్నా.. షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా తయారీ కంపెనీలు ఫలానా డీలర్లు, ఎంపిక చేసిన షాపులకు మాత్రమే ఇవి వర్తిస్తాయి అని నిబంధన పెడుతుంటాయి. మనకు అనుకూలమా? కాదా? బేరీజు వేసుకోవాలి.
ఉచితమే అధికం
వాహన తయారీదారు, డీలర్ల వద్ద పొడిగింపు వారెంటీ తీసుకునే సదుపాయం ఉంటుంది. ఇందులో థర్డ్ పార్టీ పాలసీలనూ పరిగణనలోకి తీసుకోవచ్చు. కారు, ద్విచక్రవాహనం కొంటున్నప్పుడే ఎక్స్‌టెండెడ్ వారెంటీ తీసుకుంటే కొంత ధర తగ్గే అవకాశం ఉంది. కారు మోడల్‌ను బట్టి ప్రీమియం మారుతుంటుంది. ఉదాహరణకు మారుతీ సుజుకీ స్విఫ్ట్ మోడల్‌పై ప్రామాణిక వారెంటీ రెండేళ్లు లేదా 40 వేల కి.మీ.గా ఉంటుంది. మూడేళ్లు లేదా 60వేల కి.మీ.లకు పొడిగించాలనుకుంటే.. రూ.8 వేలు, 4 ఏళ్లు/80 వేల కి.మీ.లకు రూ.11 వేలు, 5 ఏళ్లు/లక్ష కి.మీ.లకు రూ.13 వేలు చెల్లించాల్సి ఉంటుంది. లక్షన్నర రూపాయల లోపు విలువ ఉండే ద్విచక్రవాహనానికైతే ఏడాదికి దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి అత్యధిక ఆటోమొబైల్ కంపెనీలు, డీలర్లు పొడిగింపు వారంటీని ఉచితంగా అందిస్తున్నాయి.
వేటికి వర్తిస్తాయంటే..
వాహనం తయారీదారు, మోడల్‌ని బట్టి కవరేజీ ఉంటుంది. తయారీదార్లు ఇంజిన్, ఎలక్ట్రికల్ డ్యామేజీపై వారెంటీ పొడిగింపును ఇస్తుంటాయి. లేబర్ ఖర్చులూ కవరవుతుంటాయి. థర్డ్ పార్టీవి కూడా ఉంటాయి కానీ.. తయారీదారు ద్వారా పొందే ఎక్స్‌టెండెడ్ వారెంటీతో పనులు సులభంగా అవుతాయి. వీటితో సాధారణ సర్వీసింగ్ కుదరదు. బ్రేక్ ప్యాడ్లు, క్లచ్, సస్పెన్షన్, కొన్ని ఎలక్ట్రానిక్స్ మరమ్మతులూ పొడిగింపు పరిధిలోకి రావు. పెయింటు పోయినా, తుప్పు పట్టినా, ఇతర భాగాలు పాడైనా.. కవరేజీ దక్కదు. అనుమతించిన సర్వీసు కేంద్రంలోనే సర్వీసింగ్ చేయించాలి. ప్రకృతి విపత్తులకూ పరిహారం దక్కదు. ఆయిల్ మార్చడం, కొత్త టైర్లు, బ్రేక్‌లు, రోడ్‌సైడ్ అసిస్టెన్స్.. ఇలాంటి వాటికి ఇది వర్తించదు. వీటన్నింటినీ ఆలోచించుకున్నాకే పొడిగింపునకు వెళ్లాలా, వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.
ముందే తీసుకోవాలి
వాహనతయారీదారుల వారంటీ సాధారణంగా రెండేళ్లు లేదా 50వేల కిలోమీటర్లు తిరిగేవరకూ ఉంటుంది. కొత్త వాహనం కొన్నవాళ్లు సగటున నాలుగైదేళ్లైనా వాడతారు. కంపెనీ ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత తయారీ లోపాలు బయటపడితే అందుకయ్యే ఖర్చు ఓనరే భరించాలి. ఇంజిన్, క్లచ్, ట్రాన్స్‌మిషన్, కీలకమైన భాగాల్లో సమస్య వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో పొడిగింపు వారెంటీ బీమాలాగా పని చేస్తుంది. దీనికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉన్నా అమ్మకాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో పొడిగింపు వారెంటీని ఉచితంగానే అందిస్తున్నారు. దీంతో వాహన ఓనర్లు మరో రెండు, మూడేళ్లు ఇంకో యాభై వేల కిలోమీటర్ల వరకు నిశ్చింతగా ఉండే అవకాశం ఉంటుంది. మా రెనాల్ట్ క్విడ్ మోడల్‌కి ఆరునెలల నుంచి ఈ ఆఫర్ అందిస్తున్నాం. బండిని సక్రమంగా సర్వీసింగ్ చేయిస్తూ, నిర్వహణ సరిగా ఉంటే ఈ నాలుగేళ్లలో తయారీ లోపాలు ఏమున్నా కంపెనీ ఉచితంగా బాగు చేసి ఇస్తుంది. పొడిగింపు వారెంటీ కొత్త వాహనం కొన్నప్పుడే తీసుకుంటే తక్కువ మొత్తం ఉంటుంది. తర్వాత అయితే సర్‌ఛార్జి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: దంతేరస్: పసిడి కొంటున్నారా.. ఈ ఐదూ సరిచూసుకోండి