అమెజాన్ ప్రైమ్ వీడియో తన నెలవారీ సబ్‌స్క్రిప్షన్ విధానానికి మంగళం పాడింది. ఫ్రీ ట్రయల్‌ను సైతం తాత్కాలికంగా తొలగించింది. ఏడాది పాటు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందలేని వారు గతంలో నెలరోజుల ప్యాక్ తీసుకునే వారు. అలాంటి వారు ఇకపై మూడు నెలల ప్లాన్ లేదా ఏడాది ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలకు లోబడి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెజాన్ తన సపోర్ట్‌పేజీలో ఏప్రిల్ 27న ఈ వివరాలను అప్‌డేట్ చేసింది.
రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్ తదితర సేవలకు సంబంధించి ఆటోమేటిక్ రికరింగ్ చెల్లింపులపై అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ)ను రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 31 నుంచే తర్వాత నుంచి ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉండగా.. బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేల వినతితో అమలును సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏఎఫ్‌ఏ నిబంధనలకు లోబడి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ₹129ను తొలగించినట్లు అమెజాన్ పేర్కొంది. ఇకపై మూడు నెలలకు గాను యూజర్లు ₹329 చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఏడాదికి ₹999 చెల్లించి ఏడాది పాటు సేవలను పొందొచ్చు. అలాగే, ప్రైమ్ ఫ్రీ ట్రయల్‌ను సైతం తాత్కాలికంగా తొలగించింది. భవిష్యత్‌లో పునరుద్ధరిస్తుందా? పూర్తిగా నిలిపివేస్తుందా అన్నది తెలియరాలేదు.
ఇదీ చదవండి: 'షాపింగ్ యాప్‌లో వీడియో స్ట్రీమింగ్'