అత్యంత ప్రముఖుల కోసం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థతో తయారు చేయిస్తున్న రెండు ప్రత్యేక విమానాలు సెప్టెంబరు నాటికి భారత్కు వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అగ్రనేతలు, ఉన్నతాధికారులు ప్రయాణించేందుకు వీటిని ఉపయోగించనున్నారు.
వాస్తవానికి ఈ విమానాలను బోయింగ్ జులైలోనే డెలివరీ చేయాల్సి ఉంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా సకాలంలో రాలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ రెండు బీ777 విమానాలను భారత వాయుసేన పైలట్లు ఆపరేట్ చేస్తారు. వీటి నిర్వహణ బాధ్యత మాత్రం ఎయిర్ ఇండియాదే.
747 నుంచి 777కు...
ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ప్రస్తుతం బీ747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇది 'ఎయిర్ ఇండియా వన్' గుర్తును కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా పైలట్లే వీటిని ఆపరేట్ చేస్తున్నారు.
బోయింగ్ తయారు చేస్తున్న బీ777 విమానాల్లో అత్యాధునిక రక్షణ వ్యవస్థ, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్లను ఉపయోగించనున్నారు. రెండు రక్షణ వ్యవస్థలను 190 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు అమెరికా ఫిబ్రవరిలో అంగీకరించింది.