5జీ సాంకేతిక.... ప్రపంచవ్యాప్తంగా టెలికాం రంగంలో ప్రస్తుతం చర్చనీయాంశం ఇదే. భారత్లో మాత్రం భిన్నం. ఏజీఆర్ బకాయిల వివాదమే మన దగ్గర హాట్ టాపిక్. ఏజీఆర్ వివాదంతో దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా ఉన్న వొడాఫోన్ ఐడియా ఈ రంగం నుంచే నిష్క్రమించే అవకాశాలు మరింత పెరిగాయి. బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరటనివ్వకపోతే దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చని సమాచారం.
ఒకవేళ వొడాఫోన్ దుకాణం సర్దేస్తే టెలికాం రంగంలో త్రిముఖ పోటీ ఉండదు. భారతీ ఎయిర్టెల్-రిలయన్స్ జియోతో ద్వంద్వ పరిశ్రమగా మారుతుంది. ఇది కోట్ల మంది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుంది. డిజిటల్ ఇండియా దిశగా రూపాంతరం చెందుతున్న భారత్ పురోగతిని దెబ్బతీస్తుంది.
అసలు రెండు దశాబ్దాల ఏజీఆర్ వివాదం ఎక్కడ, ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం..
నేపథ్యం..
జాతీయ టెలికాం విధానం-1994 ప్రకారం టెలికాం రంగాన్ని సరళీకరించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటినుంచి సంస్థలకు లైసెన్సులను జారీ చేయటం మొదలుపెట్టింది. అంతకుముందు స్థిరమైన లైసెన్సు రుసుము ఉండేది.
1999లో ఆదాయ బదిలీ విధానానికి మారేందుకు టెలికాం విభాగం టెల్కోలకు అవకాశం ఇచ్చింది. దీని ప్రకారం టెల్కోల 'సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)'లోని కొంత మొత్తాన్ని వార్షిక లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్ వినియోగ రుసుముగా ప్రభుత్వానికి చెల్లించాలి.
ఎంత చెల్లించాలి..
టెలికాం సంస్థలన్నీ కలిపి లైసెన్సు రుసుముగా రూ.22,589 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే వడ్డీ, జరిమానాలు కలుపుకొని ఈ మొత్తం రూ.92,641 కోట్లకు చేరింది. స్పెక్ట్రమ్ వినియోగ రుసుము కింద రూ.55,054 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇలా మొత్తం రూ.1.47 లక్షల కోట్లు టెలికాం శాఖకు టెల్కోలు బకాయి పడ్డాయి.
2019 జులై నాటికి డీఓటీ లెక్కించిన దాని ప్రకారం.. టెల్కోలు చెల్లించని ప్రాథమిక లైసెన్సు ఫీజు రూ.16,746 కోట్లు. ఇందులో ఎయిర్టెల్ రూ.5,528 కోట్లు, వొడాఫోన్ రూ.6,870కోట్లు, టాటా గ్రూప్ రూ.2,321 కోట్లు, టెలినార్ రూ. 529 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.614 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.876 కోట్ల బకాయిలు ఉన్నట్లు అంచనా వేసింది.
మొత్తంగా చూస్తే..
- భారతీ ఎయిర్టెల్ రూ.35,586 కోట్లు
- వొడాఫోన్ ఐడియా రూ.53,000 కోట్లు
- టెలీ సర్వీసెస్ రూ.11,600 కోట్లు
- బీఎస్ఎన్ఎల్ రూ.4,989 కోట్లు
- ఎంటీఎన్ఎల్ రూ.3,122 కోట్లు
ఏజీఆర్ వివాదంలో పరిణామాలు ఇలా..
2003.. ఏజీఆర్ను లెక్కించే విధానాన్ని సవాలు చేస్తూ టెల్కోలు సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. టెలికాం, టెలికామేతర ఆదాయాలన్నీ ఏజీఆర్ పరిధిలోకి వస్తాయని డీఓటీ వాదించింది.
కోర్ సేవలకు సంబంధించి మాత్రమే ఏజీఆర్ లెక్కించాలని టెల్కోలు డిమాండ్ చేశాయి. డివిడెండ్, వడ్డీ ఆదాయం, పెట్టుబడులు, స్థిర ఆస్తుల అమ్మకాలపై వచ్చిన లాభాలను పరిగణనలోకి తీసుకోవద్దని సూచించాయి.
2005.. ప్రభుత్వ ఏజీఆర్ లెక్కింపును సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) సవాలు చేసింది.
2015.. టెల్కోలకు అనుకూలంగా కేసుపై స్టే విధించింది టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రైబ్యునల్ (టీడీఎస్ఏటీ). మూలధన, టెలికామేతర ఆదాయాలను లెక్కించవద్దని ఆదేశించింది.
2019 అక్టోబర్ 24.. టీడీఎస్ఏటీ ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు టెలికాం శాఖ నిర్వచించిన ఏజీఆర్ లెక్కింపును ఆమోదించింది.
2019 అక్టోబర్ 29.. టెల్కోలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టేందుకు కార్యదర్శుల కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ ప్యాకేజీలో స్పెక్ట్రమ్ ఛార్జీల తగ్గింపు, ఉచిత మొబైల్ కాల్స్, చౌక డేటా శకాన్ని ముగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
2019 నవంబర్ 13.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో బకాయిలు చెల్లించాలని టెల్కోలకు డీఓటీ నోటీసులు జారీ చేసింది. 2020 జనవరి 23లోపు జమ చేయాలని ఆదేశించింది.
2019 డిసెంబర్ 1-4.. ఏజీఆర్ బకాయిలు చెల్లించేందుకు టెలికాం కంపెనీలు టారిఫ్లను పెంచాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ కాల్ టారిఫ్లను 50 శాతం పెంచాయి. జియో కూడా 'ఆల్ ఇన్ వన్' ప్రణాళికలతో 39 శాతం ధరలను పెంచింది.
2020 జనవరి 16.. ఏజీఆర్ విషయంలో పునర్ సమీక్షకు సుప్రీం కోర్టు నిరాకరించింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ.92 వేల కోట్లు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.
2020 జనవరి 21.. ఎయిర్టెల్, వొడాఫోన్ చెల్లింపు గడువు పెంచాలని టెల్కోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
2020 జనవరి 23.. సుప్రీంకోర్టు ఇచ్చిన తుది గడువు కావటం వల్ల టెలికాం శాఖకు రూ.195 కోట్లు చెల్లించింది రిలయన్స్ జియో. మిగిలిన మొత్తం జనవరి 31న చెల్లిస్తామని తెలిపింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో బకాయిలు చెల్లించమని ఎయిర్టెల్, వొడాఫోన్ తెలిపాయి.
ఈ పరిస్థితుల్లో సుప్రీం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు టెల్కోలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని డీఓటీ స్పష్టం చేసింది.
2020 ఫిబ్రవరి 14.. బకాయిల చెల్లింపుల ఆలస్యంపై టెల్కోలతో పాటు టెలికాం విభాగంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కారంగా ఎందుకు పరిగణించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఫలితంగా తక్షణమే బకాయిలు చెల్లించాలని టెల్కోలకు డీఓటీ ఆదేశాలు ఇచ్చింది.
2020 ఫిబ్రవరి 17.. సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో రూ.10వేల కోట్లను ఎయిర్టెల్ చెల్లించింది. సుప్రీం తదుపరి విచారణకు ముందే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తానని స్పష్టం చేసింది.
వొడాఫోన్ ఐడియా రూ.2,500 కోట్లు.. మరో దఫాలో రూ.1,000 కోట్లు చెల్లించగా.. టాటా టెలీ సర్వీసెస్ రూ.2,190 కోట్లు జమచేసింది.
ఏజీఆర్ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు మార్చి 17న మళ్లీ విచారించనుంది.