దేశంలో ఆర్థిక సరళీకరణ తర్వాత ఓ వెలుగు వెలిగిన టెలికాం రంగం ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
బకాయిలను చెల్లించలేక అసమర్థతను వ్యక్తం చేస్తూ గడుపు పెంచాలని కేంద్రాన్ని వేడుకుంటున్నాయి రెండు సంస్థలు. తక్షణంగా చెల్లించాల్సి వస్తే వొడాఫోన్, ఐడియా దివాళా తీసే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
5జీపై ప్రభావం ఎలా?
ప్రస్తుత సంక్షోభంతో టెలికాం సంస్థల భవిష్యత్తు మాత్రమే కాదు.. భారత్‌కు ఎంతో అవసరమైన 5జీ సాంకేతికతపైనా ప్రభావం పడనుంది. 5జీ స్వీకరణలో ఆలస్యం మరింత పెరిగే అవకాశం ఉంది.
5జీ సాంకేతికతను అందివ్వాలంటే టెలికాం సంస్థలకు భారీగా ఖర్చవుతుంది. 4జీ నుంచి 5జీకి రూపాంతరం చెందేందుకు, స్పెక్ట్రమ్ కొనుగోలుకు వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
5జీ స్పెక్ట్రమ్ ఒక మెగాహెట్జ్ ధర రూ.492 కోట్లుగా ట్రాయ్ నిర్ణయిస్తే వేలంలో పాల్గొనబోమని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. పరిశ్రమ వర్గాలు కూడా 2020 ఏప్రిల్-జూన్ మధ్య జరగాల్సిన 5జీ ట్రయల్స్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
"రెండు, మూడేళ్ల తర్వాత 5జీ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించాలి. అప్పుడే 5జీ వాయుతరంగాలను ప్రభుత్వం సరిగ్గా లెక్కగట్టగలదు."
- ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
హువావేపై ఆంక్షలు..
ఒకవేళ టెల్కోల డిమాండ్లను అంగీకరిస్తూ ఏజీఆర్ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం గడువు పెంచినా 5జీకి మరో అడ్డంకి ఉంది. అదే చైనా దిగ్గజ సంస్థ హువావేపై అమెరికా ఆంక్షలు.
5జీ మొబైల్ డేటా నెట్‌వర్క్‌లో హువావే సేవలపై నిషేధం విధించాలని మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. హువావే డేటా వినియోగించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. హువావేతో ఒప్పందం నెరిపిన దేశాలతో సమాచార మార్పిడిని నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లు జర్మనీలోని అగ్రరాజ్య రాయబారి తెలిపారు.
అయితే చాలా చర్చల తర్వాత 5జీ ట్రయల్స్‌లో హువావే పాల్గొనేందుకు భారత ప్రభుత్వం 2019 డిసెంబర్లో అంగీకరించింది. హువావేకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భాగస్వాములుగా ఉంటాయని ప్రకటించింది.
అయితే అమెరికా ఎన్నికల వేళ హువావేపై ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆలస్యంతో కలిగే నష్టాలెంటి?
గత రెండు దశాబ్దాల్లో 2జీ నుంచి 4జీ సాంకేతికతకు భారత్ మారింది. ఈ-కామర్స్, ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో కొత్త వాణిజ్య అవకాశాలకు 4జీ సాంకేతికత తెరతీసింది. 5జీ సాంకేతికతను స్వీకరిస్తే భారత్ వృద్ధి జెట్ స్పీడ్‌లో దూసుకెళుతుందని నిపుణుల అంచనా.
"5జీ స్పెక్ట్రమ్‌తో కలిగే ప్రధాన ప్రయోజనం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ. ప్రస్తుతం సాధ్యంకాని చాలా డిజిటల్ సేవలు 5జీ స్పెక్ట్రమ్‌తో సాధ్యమవుతాయి."
-సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి