కాలగర్భంలో కలిసిపోనున్న 2019 సంవత్సరం భారతదేశానికి మేల్కొలుపుగా నిలిచిపోతుందా లేక ఏం చేయాలో తోచని జటిలమైన మలుపుగా గుర్తుండిపోతుందా అనేది మన రాజకీయ నాయకుల స్పందనను బట్టి ఉంటుంది. సత్వరం సరైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయగలరా లేదా అనే దాని మీదా ఆధారపడి ఉంటుంది. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందేమోనన్న భయాల మధ్య 2020వ సంవత్సరం మొదలవుతోంది. భారత్‌లో ఆర్థిక మందగతి ఉందా లేదా అన్న మీమాంసకు 2019 ద్వితీయార్ధంలోనే తెరపడి మందగతి వ్యవస్థాగతమైనదా లేక చక్రీయమైనదా అనే తర్జనభర్జనలు తలెత్తాయి. విద్యుదుత్పాదన, పెట్రోలియం వినియోగం, పారిశ్రామికోత్పత్తి, ఎలక్ట్రానిక్ చెల్లింపుల తీరుతెన్నులను చూశాక మందగతి నెలకొన్నట్లు రూఢి అయింది. వినియోగదారులు మొదలుకొని ఉత్పత్తిదారుల వరకు, రాష్ట్రప్రభుత్వాలు మొదలుకొని కేంద్రం వరకు, వ్యాపార సంస్థలు మొదలుకొని ఆర్థిక సంస్థల వరకు అందరూ రుణాల ఊబిలో కూరుకుపోవడమే ఆర్థిక మందగతికి మూలకారణం. చమురు ధరలు తగ్గుముఖంలో ఉండబట్టి కాని, లేకుంటే దేశ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. చమురు ధరలు తక్కువగా ఉన్నందువల్ల దిగుమతి బిల్లు తగ్గి, రూపాయి విలువ మరీ దిగజారిపోకుండా నిలబడింది. గతేడాది కొత్త కంపెనీల మీద పన్నును తగ్గించడం, విద్యుత్ వాహనాల కొనుగోలుకు లక్షన్నర రూపాయల మేరకు పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నించింది.
బ్యాంకుల బాధ
కేంద్రం 2019 మే ఎన్నికల తరవాత మూలధనీకరణకు అదనంగా రూ.70,000 కోట్లు కేటాయించినా బ్యాంకుల కష్టాలు తీరలేదు. గత ఏడాది చివరలో ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల్లో ఒకింత తరుగుదల కనిపించినా అది తాత్కాలికమే. బ్యాంకులు అసలు కొత్త రుణాలివ్వకపోవడమో లేదా ఆచితూచి ఇవ్వడమో అప్పటి పరిస్థితికి కారణం కావచ్చు. ముద్ర రుణాలు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా మిగిలిపోవడం ముంచుకొస్తున్న ముప్పునకు సంకేతం. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏలు 11.2 శాతం నుంచి 9.1 శాతానికి స్వల్పంగా తగ్గినా అదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల ఎన్‌పీఏలు పెరిగిపోవడం గమనించాల్సిన విషయం. బ్యాంకింగ్ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకొంది. 10 ప్రభుత్వ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేసింది. 25 శాతం ఎన్‌పీఏలు ఉన్న ఐడీబీఐని ఎల్‌ఐసీలో విలీనం చేసింది. ఇవన్నీ స్వల్పకాలిక ఉపశమనాలే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం కాబోవు.
బ్యాంకింగ్‌పై శ్రద్ధ అవసరం
బ్యాంకింగ్ రంగ ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. మన బ్యాంకులకు దివాలా ప్రమాదం లేదు కానీ, తమ ఆస్తులు-అప్పుల నిష్పత్తి గాడి తప్పకుండా నిరంతరం జాగరూకత పాటించాలి. మూల ధనానికి, నష్టభయమున్న ఆస్తులకు మధ్య నిష్పత్తి ఇతర జీ-20 దేశాలకన్నా, వర్ధమాన దేశాలకన్నా భారత్‌లోనే బలహీనంగా ఉంది. నిరర్థక రుణాల విషయంలో గతేడాది మనకన్నా అధ్వానంగా ఉన్నది గ్రీస్, రష్యా మాత్రమే. అయితే ఇతర వర్ధమాన దేశాల్లోకన్నా మన దేశంలోనే బ్యాంకులు తక్కువగా అప్పులు చేశాయి. చట్టబద్ధ ద్రవ్య లభ్యత నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్) కింద కాని, ద్రవ్య రిజర్వు నిష్పత్తి (సీఆర్‌ఆర్) కింద కాని మన బ్యాంకులు తమ ఆస్తుల్లో 25 శాతాన్ని మళ్లించాయి. అంటే ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు వద్ద మన బ్యాంకులు గణనీయ మొత్తాలను దాచి ఉంచాయి. అయినా ఎన్‌పీఏల బెడద వల్ల బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణ వితరణను తగ్గించేయడం ఆర్థిక వ్యవస్థను వెనక్కులాగుతోంది. దాంతో రుణాల కోసం విదేశాల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఈ తరహా వాణిజ్య రుణాలు గతేడాది రూ.70,000 కోట్లకు చేరాయి.
ఎన్‌బీఎఫ్‌సీ ఇచ్చిన రుణాలు
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఇచ్చిన రుణాల్లో 40 శాతం ఆటొమొబైల్ పరిశ్రమలోని వివిధ విభాగాలకు అందాయి. మోటారు వాహనాల కొనుగోలుకు ఇచ్చిన రుణాలూ ఇందులో ఉన్నాయి. గడచిన మూడేళ్లలో ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చిన రుణాలు ఆర్థిక వ్యవస్థ మందగతిని నిలువరించాయి. 2019 మార్చి చివరకు రూ.32.57 లక్షలకోట్లకు చేరిన ఎన్‌బీఎఫ్‌సీ రుణాలు ఆ తరవాతి నుంచి తగ్గసాగాయి. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంక్షోభం, రుణాలకు గిరాకీ తగ్గడం దీనికి కారణాలు. గతేడాది దివాలా, మధ్యవర్తిత్వ చట్టాలకు కీలక సవరణలు చేశారు. పారిశ్రామిక సంబంధాల స్మృతి పేరిట సంబంధిత చట్టాలను క్రోడీకరించారు. టెలికమ్యూనికేషన్ల రంగం గత సంవత్సరం తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. పోటీ, ప్రభుత్వ ఒత్తిళ్ల మూలంగా అప్పుల ఊబిలో దిగబడిపోయింది. టెలికం సంస్థలు రూ.92,000 కోట్లు చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించడంతో అనేక సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉంది.
సరికొత్త అభివృద్ధి నమూనా
ప్రపంచీకరణ అనంతర యుగంలో పాత పద్ధతులు పనికిరావని గ్రహించి సరికొత్త అభివృద్ధి నమూనాలను భారతదేశం రూపొందించుకోవాలి. మన ఆర్థికాభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలంటే సరికొత్త పరిశ్రమలు జనించి వ్యాపించాలని చారిత్రక అనుభవం చెబుతోంది. 1970, 80లలో భారీ పరిశ్రమలు ఆర్థికాభివృద్ధి రథాన్ని ముందుకు తీసుకెళితే 1990, 2000 దశకాల్లో సమాచార సాంకేతికత, టెలికం, మీడియా వంటి సేవా రంగాలు చోదక శక్తులుగా పనిచేశాయి. ఈ రంగాల్లో వృద్ధి వల్లవస్తుసేవలకు గిరాకీ పెరిగింది. దాన్ని తీర్చడానికి కొత్త పెట్టుబడుల అవసరం ఏర్పడింది. బ్యాంకింగ్ రంగం ముందుకొచ్చి రుణ వితరణ పెంచినందువల్ల ఉత్పత్తి వినియోగాలు విజృంభించాయి. ఉద్యోగావకాశాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ప్రభుత్వాలకు పన్నుల ద్వారా ఆదాయమూ హెచ్చింది. ఇప్పుడు ఆ ఊపు తగ్గిపోయినందువల్ల ప్రభుత్వం కొంగొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఆర్థికాభివృద్ధిలో కొత్త అధ్యాయానికి తెర తీయాలి. దానికి కింది విధంగా కార్యాచరణ చేపట్టాలి. మొదట కేంద్రం, రాష్ట్రాలు అప్పుల భారాన్ని దించుకోవాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నెలకు లక్ష కోట్ల రూపాయల చొప్పున కొత్త అప్పులు చేస్తుంటే, రాష్ట్రాలు యాభై వేలకోట్ల రూపాయల వంతున అప్పులు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ కంపెనీలు, ట్రస్టులు, బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లు తదితర సంస్థలు చేసే అప్పులు దీనికి అదనం. ప్రభుత్వ రుణాల్లో కేవలం 10 శాతాన్ని మాత్రమే వ్యక్తుల నుంచి, విదేశాల నుంచి తీసుకున్నారు. అప్పులు తీర్చలేక ఆర్థిక సంక్షోభం చుట్టుముడితే మధ్యతరగతివారు బాగా దెబ్బతింటారు.
తెలివిగా పెట్టుబడులు
ఆర్థికాభివృద్ధి నత్తనడకన సాగుతున్నప్పుడు వివిధ రంగాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుంటాయి. వీటికి తలొగ్గకుండా కేంద్రం మంచి పని చేసింది. మందగతిలో జీఎస్టీ వసూళ్లు తగ్గినందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి, కంపెనీల నుంచి చివరి బొట్టు వరకు పన్నులు పిండుకోవడానికి ప్రయత్నించాయి. ఇది అందరూ చేసే అతి పెద్ద పొరపాటు. దీనికన్నా ప్రభుత్వ వ్యయం తగ్గించుకుని, భవిష్యత్తులో భారీ ప్రతిఫలమిచ్చేలా పెట్టుబడులు పెంచడం ఉత్తమమైన పని. నిష్ఫల సబ్సిడీల పేరిట తలకు మించి ఖర్చులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెట్టుబడులు పెట్టే స్థితిలో లేవు. కనుక కేంద్రమే తెలివిగా పెట్టుబడులు పెట్టి భవిష్యత్తును భద్రంగా మార్చుకోవాలి. రాష్ట్రాల ఒత్తిడికి తలొగ్గి జీఎస్టీ రేట్లు పెంచితే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి రాష్ట్రాలు ఓటు బ్యాంకు రాజకీయాలు మాని అనుత్పాదక సబ్సిడీలకు కళ్ళెం వేయాలని కేంద్రం నచ్చజెప్పాలి.
సమూల మార్పులు అవసరం
దేశంలో యువ జనాభా ఎక్కువని గర్వంగా చెప్పుకోవడం తప్ప ఏటా పెద్ద సంఖ్యలో ఉపాధి కోసం వెదకుతున్న యువజనులకు సరైన ఉద్యోగాలు కల్పించాలన్న బాధ్యతను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. భవిష్యత్తులో అపార సంపదను, వృత్తివ్యాపారాలను సృష్టించే ఐఓటీ, కృత్రిమ మేధ వంటి అధునాతన నైపుణ్యాలను వారికి నేర్పించే ప్రయత్నం చేయడం లేదు. ఉన్న డబ్బును అనుత్పాదక సబ్సిడీలకే వెచ్చిస్తూ, అదీ చాలకపోతే ఎడాపెడా అప్పులు చేస్తూ యువతకు ఉజ్జ్వల భవిష్యత్తును అందించడానికి పెట్టుబడులు పెట్టలేని దుస్థితిలోకి జారిపోతున్నాయి. ఇకనైనా ఈ పద్ధతికి స్వస్తిచెప్పి భారీగా ఉపాధి అందించే నవతరం పరిశ్రమలను ప్రారంభించాలి. ఎలక్ట్రిక్ మోటారు వాహనాల పరిశ్రమను ఇక్కడ ఉదాహరించాలి. మౌలిక వసతుల నిర్మాణం, జల సంరక్షణ ప్రాజెక్టులపైనా పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వం అత్యవసరంగా చేయాల్సిన ప్రయోగం ఒకటుంది. అదేమంటే- ఒకటీ రెండేళ్లపాటు అనుత్పాదక, జనాకర్షక సబ్సిడీల చెల్లింపును నిలిపేసి, తద్వారా ఆదా అయిన సొమ్ముతో బ్యాంకుల పారు బాకీలను (ఎన్‌పీఏ)లను పూర్తిగా తీర్చివేయాలి. వాటి పనితీరును, రుణవితరణ పద్ధతులను సమూలంగా మార్చేయాలి. దీనంతటికీ 10-12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కానీ, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకొని కొత్త ఎత్తులకు పయనం ప్రారంభిస్తుంది. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం పెరిగి ముందనుకున్న 10-12 లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని తేలిగ్గా భర్తీచేయవచ్చు. ఈ పని చేయడానికి రాజకీయంగా ఉక్కు సంకల్పం కావాలి. ఇంకా 5జీ వంటి అధునాతన టెలికమ్యూనికేషన్ సేవలను వేగంగా ప్రవేశపెడితే ఐఓటీ, కృత్రిమ మేధ, త్రీడీ ప్రింటింగ్ వంటి సరికొత్త రంగాలు విజృంభించి ఉపాధి, వ్యాపారావకాశాలు వెల్లువెత్తుతాయి. ‘ముద్ర’ రుణాల వంటి పథకాలపై అమూల్య పెట్టుబడులను వృథాచేయడం మాని, పైన చెప్పుకొన్న అధునాతన రంగాలకు నిధులు వెచ్చించాలి. ఆ రంగాల్లో నెలకొనే పరిశ్రమలకు చైనా మాదిరిగా పదేళ్లపాటు పన్ను మినహాయింపులు ఇచ్చి ప్రోత్సహించాలి. అనుత్పాదక సబ్సిడీలపై వ్యయానికి స్వస్తి చెప్పి ఇటువంటి ఉత్పాదక కార్యక్రమాలను తలకెత్తుకునే రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే కేంద్రం నిధులిచ్చి ప్రోత్సహించాలి. సంక్షోభాన్ని వృథా పోనివ్వకుండా గరిష్ఠ ప్రయోజనం సాధించాలి!
-డాక్టర్ ఎస్ అనంత్(రచయిత -ఆర్థిక సామాజిక రంగ విశ్లేషకులు)