కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలమైంది. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. పరిశ్రమలు, కంపెనీలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో తమ ఉద్యోగం ఉంటుందో పోతుందోనని 86 శాతం మంది భారతీయులు భయాందోళనకు గురవుతున్నట్లు బ్రిటీష్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. జీవనోపాధి కోల్పోతామని అనేక మంది కలత చెందుతున్నట్లు వెల్లడించింది.
కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, భవిష్యత్తులో మరింత తీవ్రంగా ఉంటుందని సర్వేలో పాల్గొన్న 84 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న అమెరికా సహా బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రజలు మాత్రం వైరస్ ప్రభావం తగ్గుతున్నట్లు భావిస్తున్నారు. హాంగ్‌కాంగ్ వాసుల మాత్రం వైరస్ వాప్తిని కట్టడి చేసినట్లు విశ్వసిస్తున్నారు.
బ్రిటన్‌కు చెందిన క్రాస్బీ టెక్స్‌టర్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 23 నుంచి 27 మధ్య ఆన్లైన్లో ఒపీనియన్ పోల్ ద్వారా వివరాలు సేకరించింది. భారత్‌లో 86శాతం మందిలో ఉద్యోగ భయం ఉండగా, బ్రిటన్‌లో మాత్రం 31 శాతం మంది మాత్రమే ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాలో 33 శాతం, అమెరికాలో 41 శాతం మంది జాబ్ పోతుందని బెంగపెట్టుకున్నారు. అటు హాంగ్‌కాంగ్‌లోనూ అధికంగా 71 శాతం మంది ఉద్యోగం కోల్పోతామని భయపడుతున్నారు.
ఈ ఐదు దేశాల్లో నిర్వహించిన సర్వేలో 84 శాతం భారతీయులు కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సంతృప్తికరంగా ఉన్నారు. అమెరికాలో 43 శాతం, బ్రిటన్‌లో 56 శాతం, హంగ్‌కాంగ్‌లో 53 శాతం, ఆస్టేలియాలో 71 శాతం మంది ప్రజలు ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
కరోనా చికిత్సకు వైద్య పరికరాల సదుపాయాలకు సంబంధించి 68 శాతం మంది భారతీయులు ప్రభుత్వం చర్యలను సమర్థించారు. బ్రిటన్‌లో మాత్రం ఇది మైనస్ 17 శాతంగా ఉంది. అమెరికాలో కేవలం 3 శాతం మంది వైద్య పరికరాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. హాంగ్‌కాంగ్‌లో 22 శాతం, ఆస్ట్రేలియాలో 60 శాతం మంది ఈ సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.