మొబైల్ ఫోన్లు సహా దేశీయంగా ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి మరింత ఊతం ఇచ్చేందుకు ఆయా కంపెనీలకు రూ. 40వేల 995 కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాబోయే అయిదేళ్లలో ఈ మొత్తాన్ని కేంద్రం అందించనుంది. ఈ నిర్ణయం ద్వారా 2025 నాటికి ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల ఆదాయం పది లక్షల కోట్ల రూపాయలకు పెరగగలదని, కొత్తగా 8లక్షల ఉద్యోగాలు రాగలవని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
జాతీయ ఆయుష్ మిషన్‌లో ఆయుష్‌మాన్ భారత్ కింద పని చేస్తున్న ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్ కేంద్రాలను చేర్చేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్ కేంద్రాల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద రూ. 3వేల 399 కోట్లు ఖర్చు చేయనున్నారు. పత్తి విక్రయాల్లో నష్టపోయిన రైతులకు చెల్లించేందుకు భారత పత్తి కార్పొరేషన్, మహారాష్ట్ర పత్తి పంట మార్కెటింగ్ సమాఖ్యకు రూ. 7వందల 48 కోట్లు అందజేయాలని కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. పత్తి అమ్మకంలో రైతుల నష్టాన్ని భర్తీ చేసేందుకు కనీస మద్దతు ధర కోసం ఈ రెండు సంస్ధలకు మరో రూ. 312 కోట్లను అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: వసుంధర రాజె, దుష్యంత్ సింగ్కు కరోనా నెగిటివ్