భారత్‌లో 2026 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య 33 కోట్లకు చేరే అవకాశం ఉందని ఎరిక్సన్ నివేదిక అంచనా వేసింది. ఒక్కో స్మార్ట్‌ఫోన్‌లో నెలవారీ సరాసరి డేటా వినియోగం కూడా ప్రస్తుత స్థాయి నుంచి మూడింతలై 40 జీబీకి చేరొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో సరాసరిన నెలవారీ డేటా వినియోగం 14.6 జీబీగా ఉన్నట్లు పేర్కొంది.
భారత్‌లో 4జీ కనెక్షన్లు 2020లో 68 కోట్లు ఉండగా.. 2026 నాటికి 83 కోట్లకు చేరతాయని అంచనా వేసిది. 2026 ఆఖరుకు దేశంలోని మొబైల్ కనెక్షన్లలో సుమారు 26 శాతం 5జీ (33 కోట్లు) ఉంటాయని తెలిపింది. మొబైల్ ఫోన్ల వాటా 2020లో 72 శాతం ఉండగా.. 2026 నాటికి 98 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే 4జీ, 5జీల వృద్ధితో 3జీ నెట్వర్క్ సేవలు దశల వారీగా నిలిచిపోవచ్చని అంచనా వేసింది.
5జీ ట్రయల్స్ వేగవంతం..
దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా టెలికాం సంస్థలు ట్రయల్స్ ప్రక్రియను వేగవంతం చేశాయి. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఇప్పటికే గురుగ్రామ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో 5జీ ట్రయల్స్ ప్రారంభించింది. టెలికాం విభాగం (డాట్) నుంచి అనుమతులు లభించిన నెల రోజులకే ట్రయల్స్ చేపట్టింది ఎయిర్‌టెల్. దీనితో డాట్ నుంచి అనుమతి పొందిన సంస్థల్లో ట్రయల్స్ ప్రారంభించిన తొలి సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది.
ట్రయల్స్‌లో 1జీబీ పర్ సెకన్ వేగంతో డేటా బదిలీ అయినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. త్వరలోనే ముంబయి, కోల్‌కతా, దిల్లీ సర్కిళ్లలో 5జీ ట్రయల్స్ చేపట్టనుంది ఈ సంస్థ.
ఎయిర్‌టెల్‌తో పాటు జియో, వొడాఫోన్ ఐడియా, ఎంటీఎన్‌ఎల్ 5జీ ట్రయల్స్‌లో పాల్గొననున్నాయి. ఎయిర్‌టెల్ స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్‌తో జట్టుకట్టి ఈ ప్రయోగాలు చేపడుతుండగా.. జియో 5జీ సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించనుంది. జియో సహా మిగిలిన సంస్థలు ట్రయల్స్ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. 5జీ పరీక్షలకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకునే సమయం సహా మొత్తం ఆరు నెలల పాటు ఈ ట్రయల్స్ కొనసాగనున్నాయి.
స్పీడ్ మాత్రమే పెరగదు..
5జీ వల్ల కేవలం డేటా స్పీడ్ పెరగటమే కాకుండా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది 5జీ ద్వారా సాధ్యం కానుంది. ఐఓటీ పరికరాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ ను 5జీ అందిస్తుంది. ప్రతిదీ వర్చువల్ కానుంది.
5జీ వల్ల కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటి ఉపయోగం భారీగా పెరగనుంది. స్వయం చోధిత వాహనాలు 5జీ వల్ల సాధ్యం కానున్నాయి. డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి సాంకేతికతల వృద్ధిలోకి రానున్నాయి.
ఇదీ చదవండి:1జీ నుంచి 5జీ వరకు- ప్రయాణం తెలుసా?