26/11 ఉగ్రదాడులకు స్పందనగా ముంబయి చూపించిన ఐకమత్యం, దయ, సున్నితత్వాన్ని భవిష్యత్తులోనూ ప్రదర్శించాలని పిలుపునిచ్చారు దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా. ఉగ్రదాడికి గురువారంతో 12ఏళ్లు నిండిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు టాటా.
"12ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ఎప్పటికీ మరచిపోలేము. ప్రాణాలు కోల్పోయిన వారికి ఈరోజున మనం నివాళులర్పిస్తాం. శత్రువులను ఓడించేందుకు కృషిచేసిన ధైర్యవంతుల త్యాగాన్ని గౌరవిస్తాం. అయితే ఆ రోజున.. విభేదాలు పక్కనపెట్టిన ముంబయి వాసులు ముందుకొచ్చి ప్రదర్శించిన ఐకమత్యం, దయ చిరస్మరణీయం."
--- రతన్ టాటా, టాటా సన్స్ మాజీ ఛైర్మన్.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా 26/11 ఉగ్రదాడులను గుర్తుచేసుకున్నారు. ముంబయి వాసులు ధైర్యాన్ని ప్రదర్శించారన్నారు.
"అనిశ్చితి, అభద్రతా భావం నెలకొన్న ఆ రోజును ముంబయి వాసులు ఎప్పటికీ మరచిపోలేరు. నగరంతో పాటు దేశంపైనా దండయాత్ర జరుగుతున్నట్టు ఆ సమయంలో నాకు అనిపించింది. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని నేర్చుకున్నా. "ధైర్యంగా ఉండటం అంటే భయం లేకపోవడం కాదు.. నిజానికి ధైర్యంగా ఉండటం అంటే భయాన్ని జయించడమే" అన్న నెల్సన్ మండేలా వ్యాఖ్యలను మనం నిజం చేశాం."
--- ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్.
ఇదీ చూడండి:- ముంబయి ఉగ్రదాడుల్లో అమరులకు నివాళులు