రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్కి 15వ ఆర్థిక సంఘం తన తుది నివేదిక సమర్పించింది. 'కరోనా కాలంలో ఆర్థిక సంఘం' పేరుతో నివేదికను రూపొందించింది. ఈ కాపీని 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్.. రాష్ట్రపతికి స్వయంగా అందించారు.
ఐదేళ్ల కాలానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై చర్చలు, అభిప్రాయాలు, నివేదికలను అధ్యయనం చేసిన అనంతరం నివేదిక సిద్ధం చేసింది 15వ ఆర్థిక సంఘం. అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై లోతుగా అధ్యయనం చేసి.. నివేదికను నాలుగు భాగాలుగా రూపొందించింది. ఆయా రాష్ట్రాల ప్రాధాన్యాలను, అంశాలను రాష్ట్రాల వారీగా నివేదికలో ప్రస్తావించింది. 2020-21 ఏడాది కోసం ప్రత్యేక నివేదికను ఆర్థిక సంఘం గత ఏడాది అందించింది.
పన్నుల పంపకాలు, స్థానిక సంస్థలకు నిధులు, విపత్తు నిర్వహణ గ్రాంట్స్కు సంబంధించిన విషయాలపై పలు కీలక సూచనలు చేసింది ఆర్థిక సంఘం. విద్యుత్, లబ్ధిదారులకు నేరుగా చెల్లింపులు, వ్యర్థ నిర్వహణ వంటి విషయాల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని కోరింది. రక్షణ, అంతర్గత భద్రత నిధుల కోసం.. ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని సూచించింది.
పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం నివేదికను ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది.
ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ ఝా, ప్రొఫెసర్ అనూప్ సింగ్, డా. అశోక్ లాహిరి, డా. రమేష్ చంద్, కార్యదర్శి అరవింద్ మెహతా సైతం రాష్ట్రపతిని కలిశారు.