సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో అగ్రగామిగా అవతరించాలని భావిస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. భవిష్యత్తు మొత్తం ఈ రంగానిదేనని ఇప్పటికే గుర్తించిన ముకేశ్ అంబానీ సంస్థ.. వచ్చే 15 ఏళ్లలో సౌర, పవన, హైడ్రోజన్, ఫ్యూయల్ సెల్, బ్యాటరీ లాంటి సంప్రదాయేతర విద్యుత్తుకు సంబంధించిన అంశాల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చమురు, రసాయన రంగాలు లాభసాటిగా ఉన్నప్పటికీ సంప్రదాయేతర ఇంధన రంగంలో విస్తరించేందుకు రిలయన్స్ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు ప్రముఖ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ సంస్థ నివేదికలో తెలిపింది.
నివేదికలోని కీలకాంశాలు
- రానున్న 15 ఏళ్లలో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్ర సంస్థగా నిలిచేందుకు రిలయన్స్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ దిగ్గజ పెట్టుబడిదారులు, పేరున్న టెక్నాలజీ భాగస్వాములు, భవిష్యత్ పరిష్కారాల కోసం పని చేస్తున్న అంకుర సంస్థలతో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉంది.
- పునరుత్పాదక శక్తిపై రిలయన్స్ ప్రత్యేక దృష్టి సారించింది. హైడ్రోజన్, పవన , సౌర, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీతో తక్కువ ధరకే విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
- సొంత సాంకేతికతతో కార్బన్‌డయాక్సైడ్‌ను పునర్వినియోగించి ప్లాస్టిక్ వ్యర్థాలతో వనరులను సృష్టించాలని చూస్తోంది. వినియోగదారు కేంద్రీకృతంగా కార్యకలాపాలను నిర్వహించాలనుకుంటోంది.
- కార్బన్‌డయాక్సైడ్‌ను ఓ వ్యర్థంలా కాకుండా పునరుత్పాదక వనరుగా పరిగణించనుంది.
- ముడి చమురు, సహజ వాయువును వినియోగిస్తూనే.. నూతన సాంకేతికతతో కార్బన్‌డయాక్సైడ్‌ను ఉపయోగపడే ఓ ఉత్పత్తి, రసాయనంగా మార్చాలనే వ్యూహంతో ఉంది.
- ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించవచ్చని రిలయన్స్ ఇప్పటికే గుర్తించింది. ఇలా నిర్మించిన రోడ్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటున్నాయని నిర్ధరణకు వచ్చింది.
- గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌కు అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఉంది. రూ.70వేల కోట్లు వెచ్చించి అక్కడే చమురు-రసాయన మార్పిడి(ఓ2సీ) కాంప్లెక్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలో ఉన్నట్లు గతేడాది నవంబర్‌లో స్పష్టం చేసింది. 2వేల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.
- ఓ2సీ ఏర్పాటు కోసం సరైన భాగస్వామ్యులుంటే భారత, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ ఇవ్వగలమని ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశంలో వెల్లడించింది రిలయన్స్.
- ఈ భాగస్వామ్య అవకాశాన్ని సులభతరం చేయడానికి చమురు-రసాయన మార్పిడి వ్యాపారాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా మార్చాలనే ప్రతిపాదనతో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను సంప్రదించాలని రిలయన్స్ భావిస్తోంది.
సౌదీకి చెందిన ఆరాంకో.. రిలయన్స్ చమురు-రసాయన మార్పిడి వ్యాపారంలో 20శాతం వాటా దక్కించుకోవడం రెండు సంస్థలకూ విజయావకాశాలను పెంచినట్లేనని నివేదిక పేర్కొంది. ఆరాంకోతో భాగస్వామ్యం వల్ల ముడి చమురును రసాయనంగా మార్చే నిష్పత్తిని పెంచే విధంగా రిలయన్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.