లాక్డౌన్లో దాదాపు 12 లక్షలమంది ఈపీఎఫ్ఓ(ఎంప్లాయిమెట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఖాతాదారులు తమ రిటైర్మెంట్ పొదువుల్లో నుంచి రూ.3,360 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వెల్లడించారు.
కరోనా సంక్షోభంలో కష్టాలను ఎదుర్కొవడానికి కార్మికులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి నాన్ రీఫండెబుల్ అడ్వాన్స్‌ను ఉపసంహరించుకోవచ్చని మార్చి 28న ఈపీఎఫ్ఓ అనుమతిచ్చింది. ఈ మేరకు గత రెండు నెలల్లో 12 లక్షలమంది పీఎఫ్‌ను ఉపసంహరించుకున్నారని ఐదో దశ ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో ఆర్థిక మంత్రి వెల్లడించారు.
నిర్మాణ కార్మికులకు లబ్ధి
ప్రధాన్ మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) ప్యాకేజీ కింద మొత్తం 12 లక్షల మందికి ఈపీఎఫ్ఓ లబ్ధి చేకూర్చిందని ఆర్థిక మంత్రి తెలిపారు. లాక్డౌన్ కాలంలో పీఎంజీకేవై కింద విడుదల చేసిన రూ.3,950కోట్లలతో 2.2 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు కూడా లబ్ధి పొందినట్లు వెల్లడించారు.
రాష్ట్రాలే ఆదుకోవాలి!
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్. రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్న రూ.52,000 కోట్ల విలువైన నిర్మాణ సెస్‌తో 3.5కోట్లకు పైగా భవన నిర్మాణ కార్శికులకు ఆర్థిక సాయం చేయాలన్నారు గంగ్వార్.
ఇదీ చూడండి: రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌లో ఏ రంగానికి ఎంత?