సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెరుగైన వైద్యసేవలకు పెట్టింది పేరు. గతంలో ఈ కేంద్రంలో ప్రతినెలా 30కి పైగా ప్రసవాలు, 40కు మించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసేవారు. ఇవిగాక 60 మందికి పైగా వైద్యసేవలు పొందేవారు. పరిసర ప్రాంతాల రోగులతో ఎప్పడూ రద్దీగా ఉండేది.
క'న్నీటి' పాట్లు
ఈ దవాఖానా ఇప్పుడు నీటి కష్టాల్లో చిక్కుకుంది. ఆస్పత్రిలో ఉన్న ఒక్కగానొక్కబోరు వట్టిపోయింది. చుక్కనీరు దొరక్క రోగులకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. రెండురోజులకొకసారివచ్చే మిషన్ భగీరథ చాలీ చాలని నీరు ఆపరేషన్ థియేటర్ అవసరాలకే అరకొరగా సరిపోతున్నాయి. ఇక రోగుల గతి అంతే.
తగ్గిపోయిన కు.ని. ఆఫరేషన్లు
గతంలో ఇక్కడ వారానికి రెండు రోజులు కు.ని. ఆపరేషన్లు నిర్వహించేవారు. ప్రస్తుతం నీటి ఎద్దటి వల్ల ఒక్కరోజే చేస్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం ఆస్పత్రిలో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. కాని మరుసటిరోజే ఇంటికి పంపేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి.
ఎప్పుడు ఇంటికెళ్లిపోతామా అన్నట్టు..
నీళ్లు లేక ఆస్పత్రిలోని శౌచాలయాలను మూసివేశారు. రోగులు, వారి బంధువులు కనీసం కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి లేదు. ఉన్న ఒక్కరోజు కోసం బయటి నుంచి డబ్బాలతో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఆస్పత్రిలో ఉండటం కంటే ఇళ్లకు ఎప్పుడు వెళ్లిపోతామా అన్నట్లు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆస్పత్రిలోని నీటి సమస్యపై దృష్టిసారిస్తే రోగుల కష్టాలు తీర్చినవారవుతారు. దవాఖానాకు భవిష్యత్తునిచ్చినవారవుతారు.
ఇదీ చదవండి: గద్వాల జిల్లా ఇటిక్యాలపాడులో నీటి కష్టాలు