తెలుగు చలనచిత్ర సీమలో ఓ శకం ముగిసిపోయింది. అపర ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ప్రముఖ సినీనటి విజయనిర్మల ప్రస్థానం ఇక చరిత్ర పుటల్లోకి చేరింది. సినీ, ప్రేక్షక లోకాన్ని అనంతశోకంలోకి నెట్టి అనారోగ్యంతో కన్నుమూసిన దిగ్గజ నటి విజయనిర్మల అంత్యక్రియలు అశేషమైన ప్రేక్షకుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. దిగ్గజ దర్శకురాలి అంత్యక్రియలను ఆమె కుటుంబసభ్యులు రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. విజయనిర్మల కుమారుడు, నటుడు నరేశ్ దహన సంస్కారాలు నిర్వహించారు.
నానక్‌రాం గూడ నుంచి అంతిమయాత్ర..
ఉదయం 11 గంటలకు నానక్ రాంగూడలోని కృష్ణ నివాసం నుంచి విజయనిర్మల అంతిమయాత్ర మొదలైంది. బాహ్యావలయ రహదారి మీదుగా చిలుకూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న అంతిమయాత్రలో కడసారి తమ అభిమాన నటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై విజయ నిర్మలకు తుది వీడ్కోలు పలికారు. "అమ్మ అమర్ రహే" అంటూ నినాదాలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
శోకసంద్రంలో కృష్ణ..
పొద్దుటూరు ప్రధాన రహదారిపై నుంచి విజయనిర్మల భౌతిక దేహాన్ని ఆమె మనవడు విజయ్ కృష్ణతో పాటు కుటుంబసభ్యులు వ్యవసాయ క్షేత్రం వరకు తీసుకెళ్లారు. సోదరుడు ఆదిశేషగిరిరావుతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి కృష్ణ వచ్చారు. గుండెలోతుల్లో నుంచి వస్తున్న కన్నీళ్లు ఆపుకోలేక.. కన్నీటి పర్యంతమయిన కృష్ణ తన సహధర్మచారిని విజయనిర్మలను కడసారి చూసి వెళ్లారు. అనంతరం అంతిమప్రక్రియను పూర్తి చేసిన నరేశ్ తల్లి చితికి నిప్పంటించారు.
ప్రముఖుల నివాళులు..
ఉదయం తొమ్మిదిన్నరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానక్ రాంగూడలోని కృష్ణ నివాసానికి వచ్చారు. విజయనిర్మల భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి తుది నివాళులర్పించారు. తీవ్రవేదనలో ఉన్న కృష్ణను పరామర్శించి సానుభూతి తెలిపారు. సీఎం జగన్‌తోపాటు విజయసాయిరెడ్డి, మహేశ్‌బాబు, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు హాస్యనటుడు అలీ, పలువురు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు విజయనిర్మల భౌతిక కాయానికి నివాళులర్పించారు. శోకసంద్రంలో మునిగిపోయిన సూపర్ స్టార్ కృష్ణ, నరేశ్‌తో పాటు కుటుంబసభ్యులను ఓదార్చారు. విజయనిర్మల తెలుగు సినీ ప్రపంచానికి అందించిన సేవలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. విజయనిర్మల లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇక తెలుగు తెరపై కనిపించదని తమ ఆవేదనను వెలిబుచ్చారు.
ఇవీ చూడండి: నూతన భవన నిర్మాణాల కేసు జులై8కి వాయిదా