కన్నడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు రూ.40 కోట్లు ఇస్తామని కొందరు ప్రలోభ పెట్టేందుకు యత్నించారని జేడీఎస్ ఎమ్మెల్యే కె. మహదేవ్ చెప్పిన వీడియో కర్ణాటకలో ఆసక్తికర చర్చకు దారితీసింది. పిరియపట్న నియోజక వర్గంలోని స్థానికులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని మహదేవ్ వెల్లడించారు. తనను ఎవరు సంప్రదించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఈ ఎమ్మెల్యే.
భాజపానే.. మహదేవ్తో సంప్రదింపులు జరిపి ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ అవినీతి సొమ్ముతో కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందని ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఆపరేషన్ 'కమలం' పేరుతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోందని విమర్శించింది కాంగ్రెస్.
ఇటీవలే రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలి.. కూటమి ప్రభుత్వంలో కొనసాగాలంటే రూ.80 కోట్లు డిమాండ్ చేసినట్లు అక్కడి స్థానిక మీడియాలో ప్రసారమైన మహదేవ్ వీడియోలో ఉంది. అయితే ఈ విషయంపై స్పందించేందుకు జేడీఎస్ ఎమ్మెల్యే మహదేవ్.
తన గదిలోకి రూ.30-40 కోట్లతో కొంతమంది వచ్చారని, ఏసీబీకి ఫోన్ చేస్తానని చెప్పాక వారు డబ్బును తిరిగి తీసుకుని వెళ్లారని వీడియోలో మహదేవ్ చెప్పారు.
భాజపా ఖండన
కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమని కర్ణాటక భాజపా అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్ ఖండించారు. కూటమిలో తలెత్తిన విభేదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరి ప్రమేయం లేకున్నా స్వతహాగా కూలిపోతుందని భాజపా చెబుతోంది.
ఇదీ చూడండి: 'నూతన అధ్యక్షుడి ఎన్నిక వరకూ రాహులే రథసారథి'