హెయిర్ స్టైల్స్ ట్రెండ్ ప్రస్తుతం యువతను ఏలుతోంది. సినీతారలు, క్రికెటర్స్ ఇలా ఎవరో ఒకరి హెయిర్ స్టైల్ అనుకరిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే హీరోల పొస్టర్లు బయటకు వస్తున్నాయి. వాటిని సేకరించి స్టైల్ మార్చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్‌ను యువత బాగా ఫాలో అయ్యింది. ఈ అనుకరణ తొలి తరం సినీ హీరోలు ఎస్వీ రంగారావుతో ప్రారంభమైంది.
అప్పుడు..ఇప్పుడు...
ఎన్టీఆర్, అక్కినేని, శోభన్‌బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, కృష్ణలకు ప్రత్యేక రూపం ఉండేది. రెండో తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, సుమన్, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, వినిత్, అబ్బాస్ వంటి వారు ప్రత్యేకమైన స్టైల్ చూపించేవారు. మూడో తరం హీరోల్లో... జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ ప్రతి సినిమాకు కొత్త లుక్‌తో వస్తున్నారు. సినిమాకు ముందే వారి హెయిర్ స్టైల్ ఫాటోలు సెలూన్లకు చేరిపోయి యువతను ఆకట్టుకుంటున్నాయి.
అప్పుడు ఒకటే స్టైల్
1980 వరకు హెయిర్ కటింగ్ అంటే పక్క పాపిడి వరకే పరిమితం. అనంతరం పాపిడి లేకుండా వెంట్రుకలు పైకి దువ్వడం మొదలైంది. తర్వాత పోలీస్ కటింగ్, మిలటరీ కటింగ్ అందుబాటులోకి వచ్చాయి. 1991లో పంక్ స్టైల్ యువతను ఆకట్టుకుంది. నేడు స్పైసీ, స్పైక్స్, క్రొకొడెయల్, అండర్ కటింగ్, పోలే స్టైల్ ...ఇలా వందల రకాలున్నాయి. లేడిస్ పార్లర్లకు ధీటుగా మెన్స్ పార్లర్లూ వెలుస్తున్నాయి.
ట్రెండీ లుక్స్ కోసం...
తమ నటనతో ఆకట్టుకునే సినీ తారలు... తమ ఆహర్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హెయిర్ స్టైల్, గడ్డం విషయంలో సినిమా... సినిమాకు భిన్నంగా, ట్రెండీగా కన్పించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమ లుక్‌తో అభిమానులను సంపాదించుకోవటంతో పాటు థియేటర్‌కి రప్పించటంలోనూ ఇదో కొత్త మార్గంగా మార్చుకున్నారు కుర్ర హీరోలు...! ఇక యువత తమ అభిమాన హీరోల స్టైల్స్‌తో పాటు... మార్కెట్లో వస్తున్న ట్రెండీ స్టైల్స్‌ని అనుకరిస్తూ... కొత్తగా కన్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి: టీవీ9 సీఈఓగా రవిప్రకాశ్ తొలగింపు