మూడో వన్డేలో భారత ఆటగాళ్లు సైనిక టోపీలు ధరించి మైదానంలో దిగడంపై పాకిస్థాన్ అభ్యంతరం తెలిపింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటను రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి చర్యలు తీసుకోవాలని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి డిమాండ్ చేశారు.
"భారత ఆటగాళ్లు ఆర్మీ టోపీలు ధరించి ఆడటాన్ని ప్రపంచం మొత్తం చూసింది. ఐసీసీ చూడలేదా? ఈ విషయంపై పాకిస్థాన్ కిక్రెట్ బోర్డు దృష్టి సారించకముందే ఐసీసీ చర్య తీసుకోవాలి. భారత జట్టు ఇలాంటి చర్యలు ఆపకపోతే కశ్మీర్లో జరిగిన హింసకు నిరసనగా పాక్ ఆటగాళ్లూ నల్లరిబ్బన్లు ధరిస్తారు" --షా మహ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పుల్వామా ఘటనకు సంతాపంగా భారత ఆటగాళ్లు ఆర్మీ టోపీలు ధరించి బరిలో దిగారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబసభ్యులకు మ్యాచ్ ఫీజును సాయంగా అందించారు.
రాంచిలో జరిగిన మూడో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 5 మ్యాచ్ల సిరీస్లో కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలో ఉంది.