ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపడాన్ని నిరసిస్తూ భాజపా రాష్ట్ర కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. సోమవారం నగరంలోని విద్యుత్ సౌధ సహా అన్ని జిల్లా కేంద్రాల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి ధర్నా కార్యక్రమాలు ఉంటాయని సంజయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
దోపిడీ మానుకోవాలి..
విద్యుత్ సౌధ ముందు ఆందోళనలో తనతో పాటు రాష్ట్ర కోర్ కమిటీ నాయకులు పాల్గొంటారని సంజయ్ తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూనే శాంతియుతంగా నిరసన తెలిపే ఈ ధర్నా కార్యక్రమంలో కార్యకర్తలెవరూ పాల్గొనవద్దని ఆయన స్పష్టం చేశారు. సాంకేతికత, స్లాబులను సాకులుగా చూపుతూ జనం జేబులకు చిల్లులు పెట్టడం ప్రభుత్వం మానుకోవాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలపై కేసీఆర్ సర్కారు దోపిడి మానుకోవాలని హితవు పలికారు. ప్రజలపై మోపిన అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, వినియోగదారులకు మాఫీ చేయాలన్నారు. లాక్‌డౌన్ సమయంలో పనులు, కిరాయిలు లేక కార్మికులు, యజమానులు అందరూ నష్టపోయారని బండి సంజయ్ వివరించారు.