గనుల అనుమతుల జారీ వేగవంతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. కేంద్ర గనుల శాఖ అధికారులతో సచివాలయంలో వార్షిక వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. భేటీలో కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి కె.రాజేశ్వర్ రావు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ, ఇతర అధికారులు, ఏఎండీ, జీఎస్ఐ, ఎన్ఎండీసీ, ఎంఈసీఎల్, ఎన్జీఆర్ఆ, ఐబీఎం సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
సత్వర అనుమతులు పొందేలా సేవలు
అటవీ, పర్యావరణ తరహాలో గనుల శాఖలోనూ లీజుదారులు సత్వర అనుమతులు పొందేలా సేవలు అందించాలని సీఎస్ అభిప్రాయపడ్డారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ సమావేశం నిర్వహించడం అభినందనీయమన్న ఆయన... రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర గనుల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని... కేంద్ర భౌతిక శాఖ పరిశోధన సంస్థల సహకారంతో ఖనిజాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
అన్వేషణ వేగవంతం
గనుల రంగంలో తెలంగాణ అభివృద్ధి చెందేలా వివిధ కేంద్ర సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసేలా ఇటువంటి సమావేశాలను నిర్వహిస్తున్నామని కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి కె.రాజేశ్వర్ రావు తెలిపారు. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ, ఐబీఎం లాంటి సంస్థల సహకారంతో వివిధ ఖనిజాల అన్వేషణను వేగవంతంగా చేపట్టవచ్చని సూచించారు. రాష్ట్రంలో సున్నపురాయి, మాంగనీస్, ఇనుప, బొగ్గు తదితర ఖనిజాల అన్వేషణ చేపడుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 3,291 లీజుల ద్వారా 2018-19లో 4,792 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని గనుల శాఖ అధికారులు పేర్కొన్నారు. స్టేట్ జియోలజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు ద్వారా ఖనిజాల అన్వేషణతో పాటు కేంద్ర భౌతిక శాఖ సంస్థల సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: నకిలీ రశీదులతో భారీగా 'పెద్దనోట్ల' మోసం