ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సంప్రదాయ వస్త్రధారణ నిబంధన అమల్లోకి రానుంది. సత్యదేవుని ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం, వ్రతాలు, దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణతో భక్తులు రావాల్సి ఉంటుంది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ దేవస్థానం ఈవో ఎం.వి. సురేష్‌బాబు ఆదివారం వెల్లడించారు. స్వామి దర్శనానికి భక్తులు కొందరు ఆధునిక వస్త్రధారణతో వచ్చే ధోరణికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్రతాలు, ఇతర పూజలు, దర్శనానికి పురుషులు పంచె, కండువా లేదా కుర్తా, పైజమా.. మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్, చున్నీ, చిన్నపిల్లలైతే లంగా, జాకెట్టు, ఓణి వంటి దుస్తులను మాత్రమే ధరించి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేవస్థానంలో వసతిగదులకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల దళారులను నివారించేందుకు గదుల కేటాయింపు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇకపై ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ విధానం ద్వారా గదులను కేటాయిస్తామన్నారు.
ఇవీ చూడండి: శ్రీవారిని దర్శించుకున్న గులాబీ అధినేత