భాజపాపై కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భయపెట్టడం, మాయ చేయటం ఆ పార్టీ తత్వమని, కాంగ్రెస్ నైజం కాదని ఘాటుగా విమర్శించారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకువచ్చారని అభినందించారు.
"సరికొత్త ఉత్సాహం, విశ్వాసంతో రానున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమౌతున్నాం. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో సాధించిన విజయాలు మాలో కొత్త ఆశలు నింపాయి" -సోనియా గాంధీ
ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో పాటు ముఖ్య నేతలు మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌లు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యయుత, లౌకిక దేశాన్ని దౌర్జన్య దేశంగా మార్చారని మోదీ ప్రభుత్వాన్ని ఆమె విమర్శంచారు.
రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని, వాక్ స్వతంత్రాన్ని కూడా లేకుండా చేశారని యూపీఏ ఛైర్పర్సన్ ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం భయాలు, అశాంతి నెలకొన్నాయని ఆమె దుయ్యబట్టారు.