ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ఇప్పుడు కేవలం జమ్ము కశ్మీర్లోని రెండున్నర జిల్లాల్లోనే ఉగ్రజాడలు ఉన్నాయని చెప్పారు. ఐదేళ్లలో అక్కడ తప్ప దేశంలో మరెక్కడా బాంబు దాడులు జరగలేదన్నారు. గుజరాత్లోని అమ్రేలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.
కాంగ్రెస్ వల్లే 40ఏళ్లు ఆలస్యం
గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ వల్లే సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణం 40ఏళ్లు ఆలస్యమైందని ఆరోపించారు నరేంద్ర మోదీ. అప్పట్లోనే ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే గుజరాత్ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదన్నారు. తాము వచ్చాక ఈ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేశామని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించామన్నారు.
అధికారం కోసం కాంగ్రెస్ కలలు
స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్కు అతి తక్కువ లోక్సభ స్థానాలు వచ్చింది 2104లోనే అని మోదీ గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లోనేమో తక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ.. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేసింది మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను అగౌరవపరిచేందుకు కాదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.
ఇది ఎన్నికల ర్యాలీ కాదు
"ఇది నాకు ఎన్నికల ర్యాలీ కాదు. గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపే వేదికగా భావిస్తున్నా. విశేషంగా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు"
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి