రెండో రోజూ ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా హాజరయ్యారు
విదేశాల్లో స్థిరాస్తులు, ఇతర లావాదేవీలపై రాబర్ట్‌వాద్రా వరుసగా రెండో రోజూ ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న ఆరుగంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు నేడూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ సహా ఏడుగురు సభ్యుల బృందం వాద్రాను ప్రశ్నించింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం కింద నిన్న వాద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేశారు అధికారులు. రెండో రోజు విచారణకు ఉదయమే ఈడీ ముందు హాజరయ్యారు వాద్రా. దాదాపు 2 గంటలపాటు వాద్రాను ఈడీ విచారించింది. కాసేపు విశ్రాంతి అనంతరం మళ్లీ ప్రశ్నించనుంది.
అసలు కేసు దేని గురించి..?
రాబర్ట్ వాద్రా లండన్‌లో 1.9మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారన్నది ఆరోపణ. ఇందుకోసం అక్రమ నగదు బదిలీకి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది.
అక్రమాస్తుల కేసులో గతవారం వాద్రాకు దిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మొదటి సారి దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హజరయ్యారు వాద్రా.