భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. జైషే మహ్మద్ నాయకుడు మసూద్ అజార్‌ను భాజపా ప్రభుత్వమే విడిచిపెట్టిందన్నారు రాహుల్. 1999వ సంవత్సరంలో ఓ విమానాన్ని హైజాక్ చేసి ఉగ్రవాదులు మసూద్‌ను విడిపించుకున్నారని ప్రస్తావించారు. కర్ణాటక లోని హవేరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారత జైలు నుంచి మసూద్ అజార్‌ను ఎవరు పంపారో ప్రకటించండి. భాజపా ప్రభుత్వమే మసూద్‌ను సాగనంపింది. అప్పటి విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారుతో మసూద్‌ను కాందహార్ విమానాశ్రయానికి పంపించలేదా.. మీరు మరచిపోయారా?...మీ ప్రభుత్వమే మసూద్‌ను పాక్‌కు అప్పగించింది. అంతర్జాలంలో చూస్తే కాందహార్ విమానాశ్రయంలో మసూద్ అజార్‌తో అజిత్ డోభాల్ ఉన్న చిత్రం కనిపిస్తుంది. మేం మీలా కాదు.. ఉగ్రవాదానికి మేం తలవంచం. మసూద్‌ను ఎవరి ప్రభుత్వంలో అప్పగించారో మీరే దేశానికి చెప్పండి."-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
మోదీ ఎప్పుడూ అవినీతి గురించి మాట్లాడుతుంటారని కానీ ఆయనే పెద్ద అవినీతిపరుడని ఎద్దేవా చేశారు రాహుల్. మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, సిట్ డౌన్ ఇండియా అంటూ గత ఐదేళ్లుగా ప్రజల్ని కల్లబుల్లి మాటలతో మోసగించారని ఆరోపించారు. 15 నుంచి 20 మంది వ్యాపారవేత్తల మేలు కోసమే మోదీ తాపత్రయమని రాహుల్ విమర్శించారు.