హలో నమస్తే సర్. మేము ఫలానా స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ బాబు సెకండ్ క్లాస్‌కు ప్రమోట్ అయ్యాడు. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు తెరవడం ఆలస్యం అవుతుంది. ఈ లోగా ఆన్‌లైన్ తరగతులను ప్రారంభిస్తున్నాం. ఇందుకు రూ.15 వేలు ఫీజు కట్టాలి.’
* మీ పిల్లలు ఐఐటీ ఫౌండేషన్‌కు ఎంపికయ్యారు. వెంటనే పాఠశాలకు వచ్చి ఫీజు చెల్లించి సీటు కన్‌ఫామ్ చేసుకోమని ఇద్దరు పిల్లలున్న ఓ తండ్రికి వచ్చిన ఫోన్ కాల్ ఇది. పైగా ఇటీవల మీ పిల్లలు సెలెక్ట్ అయ్యారంటూ వరుసగా సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు... దీంతో ఆ తండ్రి ఏం చేయాలో అర్ధంకాక తల పట్టుకున్నారు.
ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వ్యవహారం ఇది. అసలే లాక్‌డౌన్‌తో అన్ని వర్గాలు ఆర్థికంగా కుదేలై కుటుంబ పోషణ కష్టమవుతోంది. ఫీజులు ఎలా కట్టాలని ఆందోళన చెందుతుంటే.. ఆన్‌లైన్‌లో డిజిటల్ విద్య పేరుతో మరిన్ని డబ్బులు గుంజే ప్రయత్నం జరుగుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
బడుల ఆలస్యంతో..కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం జూన్ 12 నుంచి ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. దీంతో 2020-21 విద్యాసంవత్సరంలో పాఠశాలల పనిదినాల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఫలితంగా.. ఇప్పుడున్న సిలబస్ బోధించాలంటే సమయం చాలదు. 45 రోజుల పాటు విద్యార్థులను ఖాళీగా ఉంచడంతో వారి చదువులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ దశలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు డిజిటల్ పాఠాలను తెరపైకి తెచ్చాయి. ఆంగ్ల మాధ్యమం అమలు పేరుతో ప్రభుత్వం సైతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం బుధవారం నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానలో ప్రసారాలను ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని స్థానిక ఛానళ్లు, జూమ్, గూగుల్ క్లాస్, యాప్‌లు మొదలైన డిజిటల్ మాధ్యమాల ద్వారా కార్పొరేట్, సెమీ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలను ప్రసారం చేస్తున్నాయి.
విద్యార్థులు డిజిటల్ పాఠాలు వినాలంటే ఆండ్రాయిడ్ చరవాణి లేదా ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ లేదా కంప్యూటర్, అంతర్జాల సౌకర్యం తప్పనిసరి. అంతర్జాల డేటా కూడా ఉండాలి. లాక్‌డౌన్‌తో మొన్నటి వరకు తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు కనుక ఆన్‌లైన్ పాఠాలకు ఇబ్బంది లేకుండా పోయింది. లాక్‌డౌన్ సడలింపులతో తల్లిదండ్రులు, పెద్దలు ఉద్యోగాలకు, వారి పనులపై వెళ్తూ ఫోన్లు కూడా వెంట తీసుకెళ్తున్నారు. ఈ కారణంగా విద్యార్థులకు చరవాణి అందుబాటులో ఉండదు. దీంతో వారి కోసం చరవాణి లేదా ల్యాప్‌ట్యాప్ లేదా ట్యాబ్ లేదా కంప్యూటర్ కొనాల్సిన పరిస్థితి.
లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించి వ్యవహరించే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవు. డిజిటల్ బోధన పేరిట అధిక రుసుములు వసూలు చేయడం సరికాదు. అన్ని తరగతులకు ప్రభుత్వం సప్తగిరి ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న బ్రిడ్జికోర్సు శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. - సీవీ రేణుక, డీఈవో, ఏలూరు
ఇదీ చదవండి: అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..