కొంతమంది తమ మనసులో ఏమున్నా బయటపడరు. జీవిత భాగస్వామి ఏమనుకుంటారో, ఎలా స్పందిస్తారో అనుకుని, తమ అభిప్రాయాలను వెలిబుచ్చరు. దాంతో అవతలివారి మనసులో ఏముందో తెలియక ఎవరికి వారే యమునా తీరులా బతికేస్తారు. ఇది సరి కాదు. దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే... కచ్చితంగా మనసు విప్పి మాట్లాడుకోవాలి.
- భాగస్వామి ఏదైనా మాట్లాడుతుంటే కొంతమంది వంత పాడతారు లేదా మౌనంగా ఉండిపోతారు. ఈ రెండూ సరైనవి కావు. ఎదుటివారికి మంచేదో చెడేదో తెలియజేయాలి. లేకపోతే వారు చేసేదే రైట్ అనుకుని తప్పులు చేసే అవకాశముంది.
- భార్య/భర్త చేసే పని చిన్నదా, పెద్దదా అని ఆలోచించకండి. తను వేసే ప్రతి అడుగులో నేనున్నానని ప్రోత్సహించాలి.
- మీ ఇష్టాలు, అభిరుచులను భాగస్వామితో పంచుకోవాలి. అప్పుడే మీకు ఏం కావాలో తనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఏం కొన్నా, ఏంచేసినా ఇద్దరికీ నచ్చేరీతిలో ఉంటాయి. దాంతో ఇద్దరి మధ్యా అనుబంధం పెరుగుతుంది.
- కొంతమంది తమకి ఏదైనా కష్టం వస్తే, అది మనసులోనే పెట్టుకుని సతమతమవుతారు. ఎదుటివారిని ఒత్తిడి గురి చేయడం ఎందుకని చెప్పకుండా దాచేస్తారు. ఇలాంటివే తర్వాత గొడవలకి దారితీయొచ్చు. కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరికి సమస్య వచ్చిన స్నేహితుల్లా పంచుకోండి. అప్పుడు ఎలాంటి కష్టాన్నైనా సునాయాసంగా దాటగలరు.
ఇవీ చదవండి: కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా