భాజపాలోకి హరీశ్‌రావు మాత్రమే కాదు ఎవరు వచ్చినా.. వారి పదవులకు రాజీనామా చేయించిన తర్వాతే తీసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో భారీగా మార్పులుంటాయన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గ్రామాల్లో గులాబీ కండువాలు వేసుకున్న వారు కూడా.... మోదీ ప్రధాని కావాలని కోరుకున్నట్లు తెలిపారు. తెరాస పేలిపోయే బుడగని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో పార్లమెంటు నియోజకవర్గాల్లో తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కలిసి వస్తే తెరాస 50 సీట్లకు పడిపోయేదని పేర్కొన్నారు. కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్డీఏ కూటమికి 300 పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. చంద్రబాబు వల్ల భాజపా తీవ్రంగా నష్టపోయిందని దుయ్యాబట్టారు. తమ పార్టీకి కొత్తగా ఎవరి అవసరం భాజపాకు రాకపోవచ్చని.. తెరాస అవసరం అసలే ఉండదన్నారు.
ఇవీ చూడండి: ఇందూరు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు