కేంద్ర సర్కారులో నిర్ణయాత్మక పాత్ర పోషించడమే లక్ష్యంగా.. లోక్ సభ ఎన్నికలు ఎదుర్కొంటున్న... తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రచారం పూర్తయింది. ఇవాళ సాయంత్రం వరకు ప్రచారం గడువు ఉన్నప్పటికీ వికారాబాద్ సభతోనే ముగించారు. ఎత్తులు, పైఎత్తులు.. భిన్న వ్యూహాలతో గులాబీ పార్టీ నేత ప్రచారం నిర్వహించారు.
ప్రత్యర్థుల వ్యూహాల పరిశీలన
అసెంబ్లీ ఎన్నికల ఘన విజయంతో ఆత్మ విశ్వాసంతో ఉన్న తెరాస అధినేత లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని మూడు విడతలుగా నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక.. గత నెల 17న కరీంనగర్ లో బహిరంగ సభతో ప్రచార శంఖారావం మోగించారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో నిమగ్నం కావడంతో పాటు.. ప్రత్యర్థుల వ్యూహాలను గమనించేందుకు ప్రచారానికి కొంత విరామం ఇచ్చారు. గత నెల 31న మలివిడత ప్రచారం మొదలు పెట్టిన కేసీఆర్... ఈనెల 4 వరకు పది లోక్ సభ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు.
16 సీట్లే టార్గెట్
పదహారు సీట్లు సాధిద్దాం... దిల్లీని శాసిద్దాం అంటూ కేసీఆర్ ఎన్నికల ప్రసంగాలు కొనసాగాయి. ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూనే... కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర ఎందుకు అవసరమో వివరించే ప్రయత్నం చేశారు. యాచించి కాదు.. శాసించి నిధులు సాధించాలన్నారు. వినోద్ కుమార్ కేంద్ర మంత్రి కూడా కావచ్చునంటూ... పరిస్థితులన్నీ కలిసొస్తే కేంద్రం సర్కారులో తెరాస భాగస్వామిగా ఉంటుందని స్పష్టంగా తేల్చి చెప్పారు.
ఏపీ ప్రస్తావన
వికారాబాద్ చివరి సభలో ఏపీ రాజకీయాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై మాట్లాడిన కేసీఆర్... తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇవాళ ముఖ్య నేతలతో చర్చించి... పోలింగ్ వ్యూహాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: 'నేటి సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారానికి తెర'