ఈవిద్యా సంవత్సరానికి మరో 119 కొత్త బీసీ గురుకుల పాఠశాలలను ఈనెల12న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కార్పొరేటు విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు పోటీ పడటం శుభాపరిణమం అన్నారు. నూతనంగా ప్రారంభించనున్న గురుకులాలపై అధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలకు భవనాలు సిద్ధం చేశామన్న అధికారులు... 5, 6,7 తరగతుల్లో విద్యార్థుల ప్రవేశాల మొదటి జాబితా పూర్తైందని వివరించారు. పాఠశాలలకు అవసరమైన అన్ని మౌలికసదుపాయాలను ఇప్పటికే సమకూర్చామని తెలిపారు. పాత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్కే కొత్త పాఠశాలల అదనపు బాధ్యతలు ఇచ్చామన్నారు. ఇంకా ఉపాధ్యాయులు అవసరమైన చోట పొరుగుసేవల విధానంలో నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
మంజూరైన 3689 పోస్టులను వివిధ దశలలో 2019 -20 నుంచి 2022- 23 వరకు భర్తీ చేస్తారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన పాఠశాలలకు ఈ వారంలోగా పాఠ్యపుస్తకాల సరఫరా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాల మేరకు గురుకులాలను ఉత్తమ విద్యాలయాలుగా తీర్చిదిద్దాలని... ఇందుకోసం అధికారులు నిత్యం శ్రమించాలని స్పష్టం చేశారు. కొత్త పాఠశాలల ప్రారంభం సజావుగా సాగేలా చూడాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
ఇవీ చూడండి;'రైతుబంధు అమలులో అవాంతరాలు లేకుండా చూడాలి'