అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో జైత్రయాత్ర కొనసాగుతోంది. పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తిచేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ ఉదయం 5.30 గంటలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగం విజయవంతమైంది. వాహక నౌకను శ్రీహరికోట నుంచి నింగిలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహం ప్రయోగం ఇది. 615 కిలోల బరువున్న రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహాన్నిరాకెట్ మోసుకెళ్లింది. 557 కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని వాహక నౌక ప్రవేశపెట్టింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహం విడిపోయింది. నిర్దేశించిన లక్ష్యాలను దాటుకుంటూ వాహకనౌక... ఆర్.ఐ శాట్ 2బీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకెళ్లింది.
ముచ్చటగా మూడోసారి
రాడార్ ఇమేజింట్ శాటిలైట్లలో ఆర్.ఐ శాట్ 2బీ మూడోది. మొదటగా 2009లో ప్రయోగించారు. ఆ తర్వాత 2012లో ఆర్.ఐ.శాట్ 1 ప్రయోగం నిర్వహించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన.... ఆర్.ఐ శాట్ 2బీ ఐదేళ్లపాటు సేవలు అందించనుంది. వ్యవసాయంలో మార్పులు, అడవుల సంరక్షణ, వాతావరణంలో మార్పులతోపాటు తుపానుల వంటి విపత్తులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని ఆర్.ఐ.శాట్ 2బీ అందించనుంది. కక్ష్యలో ప్రవేశపెట్టినప్పటి నుంచే ఈ ఉపగ్రహం పనిచేయడం ప్రారంభించనుంది.
ఇవీ చూడండి : నగరంలో వరుణుడు... వెంటే గాలి...!