ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణవాసులు మృతిచెందారు. శుభకార్యానికి వెళ్లివస్తుండగా...ఈ దుర్ఘటన జరిగింది. ఇంటి కోసం అలుపు లేకుండా శ్రమిస్తున్న తమ ఇంటి పెద్దదిక్కును చూసిన కుటుంబాలు గుండెలవిసేలా రోదించాయి. 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న 16 మంది మృతి చెందడం తీరని శోకాన్ని మిగిల్చింది.
అతివేగమే..!
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన 40 మంది బంధువులు నిశ్ఛితార్థం కోసం అనంతపురం జిల్లా గుంతకల్లుకు శనివారం ఉదయం బయల్దేరారు. కార్యక్రమం ముగించుకుని 3 వాహనాల్లో తిరుగుపయనమయ్యారు. 2 జీపులు ముందు వెళ్లాయి. మరో వాహనం వెనకొస్తోంది. హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై వెల్దుర్తి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనం రోడ్డు దాటుతోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు వేగంగా వస్తోంది. రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన బస్సు... డివైడర్ను దాటి... గుంతకల్లు నుంచి గద్వాల వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.
వారంతా ఒకే ఊరు
ఈ ఘటనలో... జీపులోని 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు, ఆసుపత్రిలో మరొకరు, ద్విచక్రవాహనదారుడు మాసుం (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. మాసుంతోపాటు ఉన్న ఖాజా, తుఫాన్ వాహనంలో ఉన్న విజయ్, వెంకట్రాముడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఇంటి పెద్దలు, అందివచ్చిన కుమారులు ఒకే ప్రమాదంలో మృతిచెందారు. మృతులంతా వ్యవసాయ కూలీలే. వీరిలో రాముడు పెళ్లి కుమారుడు, శ్రీనాథ్ బాబాయి కాగా...మిగిలిన వారందరూ బంధువులే. మృతుల్లో నాగరాజుకు పాప పుట్టి నెల రోజులే అయింది. ఇంకా భార్య పుట్టింటి నుంచి రాలేదు. మరో మృతుడు భాస్కర్ బ్యాంకులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వెంకట్ రాముడు అనే యువకుడు ఆటోడ్రైవర్..ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ.
ముందున్న వారికి తెలియదు!
ఘటన జరిగిన వెల్దుర్తి క్రాస్ నుంచి రామాపురం వెళ్లడానికి 79 కి.మీ దూరమే. ఈ లోపు బస్సు ప్రమాదం రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ముందు వాహనాల్లో వెళ్తున్న వారికి ఈ ఘటన జరిగినట్లు తెలియదు. తర్వాత తెలుసుకున్న వారంతా...కొద్దిసేపటికి కర్నూలు సర్వజన వైద్యశాలకు రావటంతో..అక్కడ బంధువుల రోదనలు మిన్నంటాయి.
అమ్మాయి ఇంట విషాదం
విషయం తెలియగానే...గుంతకల్లు నుంచి యువతి కుటుంబ సభ్యులు హుటాహుటిన దుర్ఘటన స్థలానికి చేరుకున్నారు. కుమార్తెను సొంత చెల్లిలి కుమారుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించిన యువతి తండ్రి ఈ సంఘటనను జీర్ణించుకోలేక పోతున్నారు. నెల రోజుల కిందట అమ్మాయి తరఫు బంధువులు రామాపురం వెళ్లి యువకుడిని చూసి వచ్చారు. ఈ ప్రమాదంతో యువతి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రధాని మోదీ సంతాపం...
మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఇది అత్యంత బాధకరఘటన అని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
ఉత్తమ వైద్య సేవలందించాలని చంద్రబాబు ఆదేశం
రోడ్డు ప్రమాదంపై తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యత్తమ వైద్య సేవలు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఆయా కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు సాయం చేయాలని, బాధితులను తక్షణం ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , గద్వాల్ జిల్లా కలెక్టర్ శశాంకను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంతాపం తెలియజేశారు.
అధికారుల పరామర్శ
ఘటనా స్థలానికి కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప చేరుకుని... మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్నూలు సర్వజనవైద్యశాల చేరుకున్న కలెక్టర్ సత్యనారాయణ క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. గద్వాల కలెక్టర్ శశాంక, ఎస్పీ లక్ష్మినాయక్, జెడ్పీ ఛైర్మెన్ బండారు భాస్కర్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
మృతుల వివరాలు...
వెంకట్రాముడు (30), గోపీనాథ్ (25), రాముడు (45) మునిస్వామి(30), భాస్కర్(30), సోమన్న(40), తిక్కన(40), సాలన్న(30), నాగరాజు(25), పరుశు రాముడు(28), సురేష్(30), విజయ్(35), పగులన్న(45), చింతలన్న(55), మాసుం (35).
ఇదీ చూడండి : లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం