యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండో రోజే వరుడు అతని తల్లిదండ్రులు, మేనత్త కరెంట్‌షాక్ తగిలి మరణించారు. సాయిలు, గంగమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్ వివాహం ఈ నెల 19న ఘనంగా జరిగింది. పదహారు పండగ కోసం బంధువులంతా వధువు ఊరికి వెళ్లి రాత్రికి అంతా ఇంటికి చేరుకున్నారు. పెళ్లి పందిరిలో లైటింగ్ కోసం వేసిన విద్యుత్ తీగను పక్కనే ఉన్న ఇనుప రాడ్డుకు చుట్టారు. బట్టలు ఆరేసే తీగను సైతం దానికే కట్టారు. రాత్రిపూట వర్షం కురిసి విద్యుదాఘాతం జరిగింది. గమనించని ప్రవీణ్ తల్లి గంగమ్మ బట్టలు తీసేందుకు వెళ్లి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిని కాపాడదామని వెళ్లిన ప్రవీణ్, తండ్రి సాయిలు, మేనత్త కూడా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు బంధువులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్ తరలించారు. పెళ్లైన రెండో రోజే ఇలాంటి హృదయ విదారక ఘటన చోటుచేసుకోవటం పట్ల గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం రోజున విద్యుత్తు ప్రమాదాల కారణంగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. పెళ్లింట జరిగిన విషాదంతోపాటు యాదాద్రి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లిలోనూ విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి చనిపోయాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో... కరెంటు షాక్ తగిలి పదహారేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇవీ చూడండి: 1.12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగే లక్ష్యంగా