ఉగ్రవాదులకు నిధులు అందకుండా అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయడంలో పాకిస్థాన్ విఫలమైందని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పేర్కొంది. అక్టోబర్ నాటికి ఈ కార్యాచరణను పూర్తి చేయాలని... లేకపోతే బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాల్సి వస్తుందని పాకిస్థాన్‌తో పాటు ఇరాన్‌నూ హెచ్చరించింది.
పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్.... ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా, అక్రమ నగదు చలామణిని అరికట్టడానికి కృషి చేస్తోంది. దేశంలో నిషిద్ధ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను పాకిస్థాన్ గుర్తించి అరికట్టాలని సూచించింది.
అక్టోబర్ వరకు గడువు
ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహం, అక్రమ నగదు చలామణి సవాళ్లను ఎదుర్కోవడానికి తగిన పటిష్ఠ చట్టాలు లేని దేశాలను గ్రే లిస్ట్‌లో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్. ఆ జాబితాలో పాకిస్థాన్‌ను కూడా గత ఏడాది చేర్చింది ఈ అంతర్జాతీయ సంస్థ.
ఫ్లోరిడాలోని ఒర్లాండోలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. మే పూర్తయినా పాకిస్థాన్.. తన కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల అక్టోబర్ లోపల కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఇరాన్‌ను కూడా ఇదే విధంగా హెచ్చరించింది
ఏంటీ ఎఫ్ఏటీఎఫ్..?
ఎఫ్ఏటీఎఫ్.. ప్రస్తుతం ఓటు హక్కుగల 36 సభ్య దేశాలు, రెండు ప్రాంతీయ సంస్థలను కలిగి ఉంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. వచ్చే ఏడాది ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్ష పదవిని చైనా దక్కించుకోనుండగా, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న సౌదీ అరేబియా ఈ సంస్థలో శాశ్వత సభ్యదేశంగా చేరనుంది.
ఈ సంస్థలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్, భారత్, ఐరోపా గళమెత్తగా, టర్కీ మాత్రమే పాకిస్థాన్‌కు అండగా నిలిచింది.