IND vs SA: తన ఫామ్‌పై బయట జరిగే అనవసర చర్చల గురించి పట్టించుకోనని అన్నాడు టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాను కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదని చెప్పాడు. రేపటి నుంచి (జనవరి 11) ప్రారంభం కానున్న మూడో టెస్టుకి అతడు అందుబాటులోకి రానున్నాడు. ఆఖరి టెస్టు ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.
"గతంలో నేను నెలకొల్పిన రికార్డులతో పోల్చుతూ.. నా వ్యక్తిగత ఫామ్‌పై చాలా రోజుల నుంచి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అన్ని వేళలా జట్టు కోసం మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించాను. నేను కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోను. నేను టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు టీమ్ఇండియా ఏడో స్థానంలో ఉండేది. ప్రస్తుతం నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ప్రతి మ్యాచ్‌ను గెలవాలనే సంకల్పంతో ఆడుతున్నాం. నాణ్యమైన బౌలర్లతో మా పేస్ దళం బలంగా ఉంది. గాయం కారణంగా సిరాజ్ దూరమైనా ఇంకా చాలా మంది సీనియర్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా లేని లోటును భర్తీ చేయగలడన్న నమ్మకం ఉంది. రెండో టెస్టులో సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకు ముందు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించారు. కష్ట సమయాల్లో జట్టు కోసం కీలక ఇన్నింగ్స్‌లు ఆడే ఆటగాళ్లను బలవంతంగా దూరం చేయకూడదు. ప్రాక్టీస్ సెషన్లో రిషభ్ పంత్‌తో మాట్లాడాను. లోపాలను అధిగమించి బాధ్యతాయుతంగా ఆడాలి. కెరీర్లో మనమందరం తప్పులు చేసి ఎదిగిన వాళ్లమే. చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి"
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
రెండో టెస్టులో ఓటమి పాలైన టీమ్‌ఇండియా.. చివరి టెస్టులో విజయం సాధించి సఫారీల గడ్డపై చరిత్ర సృష్టించాలని చూస్తోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో రెండు జట్లు తలో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేశాయి. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు కేప్‌టౌన్ వేదికగా రేపటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు.. కోహ్లీ ఈ రికార్డు సాధించేనా?