కేంద్రం ఎమర్జెన్సీ కంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తోందన్నారు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ విస్తృత ప్రయోజనాలు కాపాడేందుకు నేను నా జీవితాన్ని, పార్టీని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు దీదీ. భాజపా పాలనలో డెమొక్రసీ 'నమో'క్రసీగా మారిందని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు సంధించారు. 12 వరకు చదివిన మోదీ గత ఎన్నికల్లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారని, ఈ సారి ఉన్నత విద్యనభ్యసించిన వారికి మద్దతివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేజ్రీవాల్.
ఎన్డీఏ కూటమి ఓటమే లక్ష్యంగా మహాకూటమి అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మోదీ అతి త్వరలో మాజీ ప్రధానిగా మారనున్నారని తెలిపారు. దుశ్శాసన రీతిలో పాలన సాగిస్తున్నారని సీపీఐ నేత సీతారాం ఏచూరీ విమర్శించారు.
ప్రతిపక్షాల ఐక్యతా మంత్రం...
ప్రతిపక్షనేతలు ఈ నెలలో ఒకే వేదికపై కన్పించడం ఇది మూడోసారి. తొలిసారి కోల్‌కతా బ్రిగేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఐక్యతా ర్యాలీలో ప్రతిపక్షనేతలు పాల్గొనగా, రెండోసారి శారదా కుంభకోణం అంశానికి సంబంధించి భేటీ అయ్యారు.