అమెజాన్ అడవుల అంశంలో విదేశాల ఆర్థిక సాయంపై వెనక్కి తగ్గింది బ్రెజిల్. ఇతర దేశాల నుంచి వచ్చే నిధులను పొందేందుకు ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు బ్రెజిల్ అధ్యక్షుడి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
"స్వచ్ఛంద సంస్థలు, విదేశాల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు బ్రెజిల్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బ్రెజిల్‌కు వచ్చే ఈ నిధులు దేశ ప్రజల అధీనంలో ఉంటాయి."
- ఒటావియో రెగో బరోస్, బ్రెజిల్ అధ్యక్షుడి ప్రతినిధి.
తొలుత నిరాకరణ..
పర్యావరణానికి కేంద్ర బిందువుగా ఉన్న అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగి వేల హెక్టార్లు మేర ధ్వంసమయింది. ఈ విపత్తుపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేయటమే కాదు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే విదేశీ ఆర్థిక సాయాన్ని తీసుకునేందుకుబ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో నిరాకరించారు.
ఇటీవలే ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సులో అమెజాన్ కార్చిచ్చును అదుపు చేసేందుకు 20 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించాయి సభ్య దేశాలు. కానీ ఆ సాయాన్ని బ్రెజిల్ తిరస్కరించింది. అవి యూరప్‌లో అరణ్యాల పునరుద్ధరణకు ఉపయోగించాలని హితవు పలికింది.
సెప్టెంబర్ 6న సమావేశం...
అమెజాన్ అడవులను రక్షించడానికి పెరూ అధ్యక్షుడు మార్టిన్ విజ్కారా, కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సమావేశానికి పిలుపునిచ్చారు. అమెజాన్‌ను పరిరక్షించటం, అభివృద్ధి చేయటం, అటవీ సమాజానికి మేలు చేసే లక్ష్యంగా కొలంబియాలో సెప్టెంబర్ 6న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఇతర దేశాలకు ఆహ్వానం ఉంటుందా అన్న దానిపై స్పష్టత నివ్వలేదు. పెరూ, కొలంబియా, బ్రెజిల్ దేశాల సరిహద్దు ప్రాంతంలోని లెథీసియాలో ఈ సమావేశం జరగనుంది.
ఇదీ చూడండి:అమెజాన్ కార్చిచ్చు ఆర్పేందుకు ముమ్మర చర్యలు