వర్క్అవుట్ ఏదైనా కాస్త ఆహ్లాదభరితంగా... మరింత ఉత్సాహపూరితంగా ఉంటే ఆ మజా వేరు. ఇదే నేటితరం మనసుకు నచ్చే వర్క్అవుట్ తీరు. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా సరికొత్త హంగులు అద్దుకుని ఆకట్టుకుంటోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని... చల్లని గాలులు పీలుస్తూ యోగాసనాలు వేస్తుంటే... ఆ కిక్కే వేరప్పా. తనువు మనసును ఏకం చేస్తూ.. మనిషిలోని శక్తిని పునరుత్తేజపరిచేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాస్త వినూత్నంగా చేద్దాం:
ఒంటరిగా కూర్చుని యోగా చేయటం ఓ వ్యాయామంలా అనిపిస్తుంది. అదే నలుగురితో పాటు కలిసి సరదాగా ఆడుతూ... పాడుతూ వినూత్నంగా చేసే యోగా నూతన ఉత్తేజాన్ని... రోజూ వారి ఒత్తిడుల నుంచి మరింత ఉపశమనం ఇస్తోంది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఏరియల్ యోగా. ఇప్పటి ఈ నయా ట్రెండ్ యువతను బాగానే ఆకర్షిస్తోంది. హ్యామక్ సహాయంతో చేసే ఈ యోగా తమకు ఎంతాగానో ఉపయోగపడుతుందంటున్నారు కొందరు యువత.
ఎలాంటి ఆసనమైనా సులువే:
సాధారణంగా యోగాని మ్యాట్‌పై చేస్తాము కానీ ఈ ఏరియల్ యోగాలో మాత్రం... సిల్క్ క్లాత్‌ని హుక్‌కి వేలాడదీసి వాటి సహాయంతో యోగాసనాలు వేస్తారు. దీనినే హ్యామక్ అని కూడా అంటారు. పెల్లాటిస్, యోగా, డాన్స్ ఫార్మ్స్‌ని కలిపి చేసేదే ఈ ఏరియల్ యోగా. ఆసనాలు వేయడం కాస్త కష్టతరమైన విషయం. అయితే ఈ ఏరియల్ యోగాలో ఎంతటి క్లిష్టమైన ఆసనాన్నైనా... సునాయాసంగా వేసేయెచ్చు. అంతే కాదు... శరీరానికి మంచి ఫ్లేక్సిబులిటీతో పాటు... హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కలిగే అనుభూతిని కూడా ఆస్వాధించవచ్చు. అందుకే ఇప్పుడు ఈ నయాట్రెండ్కి జై అంటున్నారు యువతరం. ప్రతిదానిలో కొత్తదనం కోరుకునే నవతరాన్ని ఈ ఏరియల్ యోగా ఎంతగానో ఆకర్షిస్తోంది. విదేశాల్లో ఉండే ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశానికి చేరుతోంది.
మీరూ ట్రై చేయండి:
సరదాగా ఆడుతూ... పాడుతూ... హ్యామక్లతో మాయాజాలం చేసినట్టు కష్టమైన యోగాసనాలను సులువుగా వేస్తూ... ఎక్కువ సేపు ఆసనంలో ఉండే అవకాశాన్ని కల్పించేదే ఈ ఏరియల్ యోగా. మరింకెందుకు ఆలస్యం... ఈ యోగాడేని పురస్కరించుకుని మీరు ఇలా ఓ ఆసనం వేసేయండి.
ఇదీ చూడండి: చిత్రకళలో ఔరా అనిపించిన అంధులు