కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచీ పోటీ చేస్తారని ఊహాగానాలొచ్చాయి. ఎట్టకేలకు కేరళలోని వయనాడ్ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
సాధారణంగా రాహుల్ ప్రతిసారి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచే పోటీ చేస్తారు. అయితే ఈ సారి దక్షిణాది నుంచి పోటీ చేయడం వెనుక బలమైన వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాదిన పార్టీని బలమైన శక్తిగా మార్చడమే ఈ నిర్ణయం వెనుక కారణమా?
మరో కంచుకోట..!
2009లో వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గంగా ఏర్పడింది. అక్కడ ఇప్పటి వరకు కాంగ్రెస్‌దే గెలుపు. 2009లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్ఐ షానవాస్ గెలిచారు. 2014లో కూడా కాంగ్రెస్-యూడీఎఫ్ పొత్తులో భాగంగా ఈయనే తిరిగి ఎన్నికయ్యారు.
ఈసారీ యూడీఎఫ్‌తో కలిసే కేరళలో పోటీ చేస్తోంది కాంగ్రెస్. ఎల్డీఎఫ్ నుంచి పీపీ సునీర్ బరిలో ఉన్నారు. ఎన్డీఏ తరఫున భారత ధర్మ జన సేన (బీడీజేఎస్) పార్టీ పోటీలో ఉంది. ఇంతవరకు ఈ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే రాహుల్ గాంధీకి దీటైనా ప్రత్యర్థిగా ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు సురేశ్ గోపీని బరిలోకి దించే అవకాశం ఉంది.
వయనాడ్ ప్రత్యేకతలు..
వయనాడ్‌లో కాఫీ, టీ, కోకో, పెప్పర్ పంటలు అధికంగా పండిస్తారు. ఈ ప్రాంతలోని ఎడక్కల్ గుహలు, ఆకర్షణీయ ప్రదేశాలు, సెలయేళ్లు పర్యటకులను అమితంగా ఆకర్షిస్తాయి. ఈ పార్లమెంటు స్థానంలో 7 నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 13,25,788. మహిళా ఓటర్లు 6,70,002. ఇక్కడ రైతుల సంఖ్య అధికంగానే ఉంది. ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ.
కాంగ్రెస్‌కు కొత్త కాదు..
దక్షిణాది నుంచి కాంగ్రెస్ అగ్రనాయకులు బరిలోకి దిగడం ఇది మొదటిసారి కాదు. గతంలో రాహుల్ గాంధీ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కర్ణాటకలోని చికమంగళూరు నుంచి పోటీ చేశారు. అలాగే కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్మాజీఅధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంతకుముందు ఓ సారి బరిలోకి దిగారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానాన్ని ఎంచుకున్నారు.
- ఇదీ చూడండి:"మోదీ ప్రధానమంత్రి కాదు ప్రచారాల మంత్రి"